వనపర్తి రైస్‌మిల్ అసోసియేషన్ ఏర్పాటు
అధ్యక్షుడిగా వెంకటేశ్వర్ రెడ్డి ఎన్నిక
వనపర్తి ,జులై 23 (విజయక్రాంతి): వనపర్తి జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని గురువారం కొత్తకోటలో జరిగిన ప్రత్యేక సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దాదాపు 80 మంది సభ్యుల సమక్షంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా కిచ్చన్నగారి వెంకటేశ్వర్ రెడ్డి (పెబ్బేరు), ప్రధాన కార్యదర్శిగా కల్వ వెంకటస్వామి (ఆత్మకూరు), కోశాధికారిగా మేడపల్లి సంపత్ కుమార్ రెడ్డి (కొత్తకోట) ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా పల్లెర్ల జగదీశ్వర్ కుమార్, అచ్చం పరమేశ్వర్, ముఖ్య సలహాదారులుగా హరినాథ్, రమేష్ శెట్టి, ఉపాధ్యక్షులు, అదనపు కార్యదర్శులతో కూడిన పూర్తి కార్యవర్గాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ నూతన కమిటీ సభ్యులను శాలువాలతో సన్మానించి అభినందించారు. నూతన అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, రైతులు, ప్రభుత్వం మధ్య వారధిగా పనిచేస్తూ నాణ్యమైన బియ్యం అందించడంలో రైస్ మిల్లర్ల పాత్రను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. సభ్యుల సంక్షేమంతో పాటు జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.






