24 July, 2026 | 1:16 AM

ప్రభుత్వ బడుల పర్యవేక్షణపై దృష్టి సారించాలి

24-07-2026 12:00 AM
  1. అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి
  2. భౌతిక నమోదు త్వరితగతిన పూర్తి చేయాలి 
  3. జీరో’ పాఠశాలలపై ఆగ్రహం 

రంగారెడ్డి, జులై 23 (విజయక్రాంతి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భౌతిక నమోదు ప్రక్రియను యుద్ధపాతిపదికన పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లా  అడి షనల్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా విద్యాశాఖలోని పలు కీలక అంశాలపై జిల్లా విద్యాధికారి  వెంకటేశ్వర్లు, కోఆర్డినేట ర్లు, మండల విద్యాధికారులతో ఆమే సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలోని పలు కీలక అంశాలపై చర్చించారు.

భౌతిక డేటా,  యుడైస్ వ్యత్యాసాలు సరిదిద్దాలి:

ప్రతీ ఎంఈఓ తమ పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో భౌతిక సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల డేటా ను తెప్పించుకోవాలి. యుడైస్ నమోదు సం ఖ్యకు, భౌతిక డేటాకు మధ్య ఉన్న తేడాలపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

కేజీబీవీ, ప్రీ ప్రైమరీలో నమోదు పెంపు:

ప్రీ-ప్రైమరీ పాఠశాలలతో పాటు కేజీబీవీ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును గణనీయంగా పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మండల విద్యాధికారులు తమ పరిధిలోని పాఠశాలలను సక్రమంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గి ’జీరో’ పాఠశాలలుగా మారడానికి గల మూల కారణాలను ఎంఈఓలను అడిగి తెలుసుకున్నారు.ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని పర్యవేక్షించిన అడిషనల్ కలెక్టర్.. ఎఫ్‌ఆర్‌ఎస్  హాజరులో ఎంఆర్సీలలోని సీఆర్పీల  అటెండెన్స్ తక్కువగా ఉండటంపై స్పందించారు. నిర్లక్ష్యం వహించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారికి సూచించారు.

దివ్యాంగులకు ప్రత్యేక టాయిలెట్లు:

జిల్లాలోని పాఠశాలల్లో జరుగుతున్న సివిల్ పనుల పురోగతిని సమీక్షించారు. ప్రతీ పాఠశాలలో టాయిలెట్ సౌకర్యం ఉండేలా చూసుకోవాలని, ముఖ్యంగా దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా టాయిలెట్లు నిర్మించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.ప్రతి నెలా విద్యాశాఖపై ఇలాంటి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తాను.

ఇకపై మండల విద్యాధికారులు అందరూ పూర్తిస్థాయి, ఖచ్చితమైన డేటాతోనే సమావేశాలకు హాజరు కావాలని  అడిషనల్ కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, కోఆర్డినేటర్లు మరియు జిల్లాలోని అందరు మండల విద్యాధికారులు పాల్గొన్నారు.