23 August, 2026 | 1:11 AM

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి!

23-08-2026 12:15 AM
  1. నేరేడ్మెట్‌లో రెచ్చిపోతున్న పోకిరీలు, ప్రేమికులు
  2. కానరాని...‘షీ టీమ్’ పర్యవేక్షణ 

మల్కాజిగిరి, ఆగస్ట్ 22, (విజయక్రాంతి): నేరేడ్మెట్ ఫుట్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి అసాంఘిక కార్యకలా పాలకు అడ్డాగా మారింది.  పరిసర ప్రాంతాల్లో కాలేజీలకు వెళ్ళే విద్యార్థులకు, మందు బాబులకు ఒక  మంచి అడ్డాలాగా తయారైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే రోడ్లు, కాలేజీలు, రద్దీ ప్రాంతాలు, ఆలయాలు చివరకు ఉత్సవాల్లో సైతం పోకిరీల తిష్ట పెరిగింది.

తాజాగా  ఫుట్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా లవర్స్ కు అడ్డాగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. బ్రిడ్జి కి కూత వేటు దూరంలోనే నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ  పోలీసులు జాడకానీ, షీ బృందాల ప్రత్యేక నిఘా కానరావడం లేదు. దీంతో ప్రేమికులు, ఆకతాయిల ఆగడాలు శృతిమించుతున్నాయి. కొందరు ఆకతాయిలు విద్యార్థినులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. 

నిర్వహణ అధ్వాన్నం లక్షలు ఖర్చుపెట్టి నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి 

నిర్వహణ అధ్వాన్నంగా మారింది. ఇక్కడ లిఫ్ట్ చెడిపోయి సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకునే వారే లేక నిరుపయోగంగా మారింది. దీంతో వృద్ధులు , మహిళలు మెట్లు ఎక్క లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకనైనా అధికారులు, పాలకులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్ధానికులు, పాదచారులు కోరుతున్నారు.