07-02-2026 01:59:08 AM
మున్సిపాలిటీలకు వచ్చే నిధులన్నీ కేంద్రానివే
హరీశ్‌రావు కూడా అదే చెప్తుండు
కేసీఆర్ కుటుంబంతోపాటు రేవంత్ కూడా జైలుకు వెళ్లాల్సిందే
ఆ కుటుంబం లక్షల కోట్లు కాజేసింది
అబద్దాలతో ప్రజలను మోసం చేశారు
కవితను జైలుకు పంపింది బిజెపీయే
హిందువుల రిజర్వేషన్లు ముస్లింలకు కట్టపెట్టేందుకు సీఎం రేవంత్ ముస్లిం గా మారాడా?
ఢిల్లీలో కాదు గల్లీలో కూడా బిజెపిని గెలిపించాలి
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మునిసిపల్ ఎన్నికల శంఖారావంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
గజ్వేల్, ఫిబ్రవరి 6: హిందూ దేవుళ్ళ పై ఓట్లు వేసి గెలిచిన సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక హిందూ దేవుళ్లను తిడుతూ జోకులు వేస్తున్నాడని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. శుక్రవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల శంఖారావంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హిందూ దేవుళ్ళపై జోకులు వేస్తున్న రేవంత్ రెడ్డి ఒక్కసారి అల్లాపై జోక్ వేయాలన్నారు.
గ్రామాలు మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుందని, ఈ విషయం హరీష్ రావే తమ ప్రచార కార్యక్రమాల్లో చెబుతున్నాడన్నారు. కెసిఆర్, హరీష్ రావు కాలేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్లు కాజేశారన్నారు. అల్లుడు వస్తే డబుల్ బెడ్ రూమ్ లో ప్రత్యేకంగా ఉండాలని చెప్పిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఇంటి ఆడబిడ్డ, అల్లుడు మాట్లాడుకుంటే కూడా ఫోన్ టాపింగ్ చేశారని ఆరోపించారు.
వారితోపాటు ఓటుకు నోటు కేసులో సంచులు మోసిన సీఎం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లాల్సిందే అన్నారు. హిందువుల రిజర్వేషన్లు ముస్లింలకు కట్టపెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ముస్లింగా మారినట్లు ఎద్దేవా చేశారు. నిజామాబాద్, కరీంనగర్లను డల్లాస్ గా మారుస్తా అన్న కెసిఆర్ గజ్వేల్ లో కూడా పూర్తిగా అభివృద్ధి చేయకుండా సమస్యల్లో వదిలేశారని ఆరోపించారు. హరీష్ రావు ను ఎప్పుడు చూసినా ఫోన్ స్తంభమే గుర్తొస్తుందన్నారు.
దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ 5 కోట్ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి పేదలకు ఇచ్చారని, ఇందులో ముస్లిం కుటుంబాలు కూడా ఉన్నాయన్నారు. ప్రతి ఇంటికి కరోనా నుండి ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నారని, దేశంతో పాటు ముస్లిం దేశాలకు కూడా కరోనా వ్యాక్సిన్ పంపి ప్రాణాలు కాపాడింది ప్రధాని నరేంద్రమోడీయే అని గుర్తు చేశారు. కెసిఆర్ ప్రభుత్వంలో అవినీతితో లక్షల కోట్లు వెనకేశారని, అబద్దాలతో సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారన్నారు.
ఇప్పటివరకు మెగాడీఎస్టీ లేదని, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారని, పెన్షనర్లకు డబ్బులు సెటిల్మెంట్ చేయడం లేదని ఆరోపించారు. తులం బంగారం, రైతు భరోసా, ఇంకా ఎన్నో పథకాల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావుల కేసులను సిబిఐకి అప్పగించామని కిషన్ రెడ్డి ఇంకా వారిని జైల్లో వేయలేదని నిజామాబాద్ లో జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి అన్నారని, కానీ కవితను కూడా జైల్లో వేసింది బిజెపి ప్రభుత్వమే అని అరవింద్ గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి ని కూడా త్వరగా జైలుకు పంపేలా చూడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సభాముఖంగా విజ్ఞప్తి చేశారు. సంచుల కేసులో కేసీఆర్, ఫోన్ టాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి లాలూచీపడ్డారని, దొందు దొందేనన్నారు. గజ్వేల్ లో జరిగిన శివాజీ విగ్రహ ఘటనలో అన్ని పార్టీల హిందూ సోదరులను జైల్లో పెట్టారని ప్రజలకు గుర్తు చేశారు.
ఢిల్లీ తోపాటు గల్లీలో కూడా బిజెపిని గెలిపించి ప్రజలు బిజెపికి అధికారాన్ని కట్ట పెట్టాలని, గజ్వేల్లో గాడిపల్లి కళ్యాణి భాస్కర్ ను మున్సిపల్ చైర్మన్ గా చేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఆకుల విజయ, జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, సీనియర్ నాయకులు జస్వంత్ రెడ్డి, సింగం సత్తయ్య, 20 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు, రాష్ట్ర జిల్లా మండల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.