20 May, 2026 | 7:57 PM

అర్హులైన గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి

20-05-2026 06:34 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలోని అన్ని గిరిజన తండాలలో ఉన్న అర్హులైన పేద గిరిజనులను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని బీఆర్ఎస్ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు గుగులోతు సందీప్ నాయక్ కోరారు. గరిడేపల్లిలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అయినప్పటికీ ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని ఆరోపించారు.

హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ కాలం గడుపుతుందని అన్నారు. మండలంలోని పేద గిరిజనులను గుర్తించి వెంటనే అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మండలంలోని ప్రతి గిరిజన తండాకు 300 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించి గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా అర్హులను గుర్తించి ఇండ్లు కేటాయించాలని ఆయన కోరారు.