చెరువుగట్టులో అగ్నిప్రమాదం
- 17 షాపులు దగ్ధం, పేలిన రెండు గ్యాస్ సిలిండర్లు
- నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో ఘటన
నార్కట్‌పల్లి, జూలై 26 (విజయ క్రాంతి): ప్రముఖ పుణ్యక్షేత్రం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెరువుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి గుట్ట కింద శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్షేత్ర పరిసరాల్లోని నంది విగ్రహం సమీపంలో ఉన్న ఒక బొమ్మల దుకాణంలో ప్రారంభమైన మంటలు క్షణాల్లో పక్కనే ఉన్న ఇతర షాపులు, తోపుడు బండ్లకు వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో సుమారు 17 బొమ్మల షాపులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.
దీంతో బాధిత వ్యాపారులు తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రమాద సమయంలో స్థానికులను మరింత భయాందోళనకు గురిచేస్తూ రెండు గ్యాస్ సిలిండర్లు పేలినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. షాపులసమీపంలోనే ఉన్న గ్రామ పంచాయతీ భవనానికి కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో ఆఫీసు లోపల ఉన్న పలు ముఖ్యమైన ప్రభుత్వ ఫైళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. 2.5 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని స్థానిక గ్రామ సర్పంచ్ వెల్లడించారు.
వెంటనే స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రెస్క్యూ వాహనాలతో రంగానికి దిగి ఏకధాటిగా మూడు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద సమయంలో దుకాణాల్లో వ్యాపారులు గానీ, భక్తులు గానీ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. దీంతో స్థానికులు, దేవస్థానం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.






