42% కోసం కేంద్రంపై పోరాడండి
- డీలిమిటేషన్ లాగానే బీసీ రిజర్వేషన్ల అమలు కోసం మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి చేయండి
- ఢిల్లీలో సీఎం రేవంత్‌ను కోరిన జాజుల శ్రీనివాస్‌గౌడ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): మహిళా బిల్లు, డీలిమిటేషన్‌పై ఇండియా కూటమిని ఒక్కటి చేసి, పార్లమెంటులో ఏ విధంగా పోరాడారో బీసీ డిమాండ్లపై కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, బీసీ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు.
రెండు రోజులుగా డిల్లీలో ఆందోళన చేపట్టిన బీసీ సంఘాల నేతలు శనివారం డిల్లీ లో సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి, కేంద్రానికి పంపించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపుదల, అలాగే ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న జాతీయ జనగణనలో బీసీ కులగణన చేపట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ సీఎంకు వినతిపత్రం అందజేశారు.
అనంతరం మీడియాతో జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జరుగుతున్న జనా భా లెక్కలు పూర్తికాకుండానే డీలిమిటేషన్, మహిళా బిల్లును తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఉన్న ఇండియా కూటమి ఒకటి చేయడంలో అత్యంత క్రియాశీలకపాత్ర పోషిం చి, 131వ రాజ్యాంగ సవరణ పార్లమెంటులో వీగిపోయేలా చేయడం శుభపరిణామామన్నా రు.
ఇదే సమయంలో, ఇదే స్ఫూర్తితో సామాజిక రిజర్వేషన్లపై విధించిన 50% పరిమితిని ఎత్తివేసేలా, తెలంగాణలో చేసిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో ఆమోదించే విధంగా, దేశవ్యాప్తంగా జరిగే జనగణ నలో బీసీ కుటుంబాలను లెక్కించే విధంగా కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ, సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, తాటికొండ విక్రమ్‌గౌడ్, ఇంకచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, కనకాల శ్యామ్, బీ మనిమంజరి, జాజుల లింగంగౌడ్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి తారకేశ్వరి, పులి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.






