19 April, 2026 | 4:06 AM

మహిళా సాధికారత వ్యతిరేకి డీఎంకే

19-04-2026 12:20 AM
  1. మహిళా కోటా బిల్లుకు కాంగ్రెస్, డీఎంకే మోకాలడ్డు 

కొయంబత్తూరు ఎన్నికల సభలో ప్రధాని మోదీ మండిపాటు

చెన్నై, ఏప్రిల్ ౧౮: మహిళా సాధికారతకు బద్ధ వ్యతిరేకి డీఎంకే అంటూ ప్రధాని మోదీ ఘాటు విమర్శలు చేశారు. తమిళనాడులోని కొయంబత్తూరులో శనివారం బీజేపీ నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన నిప్పులు చెరిగారు. లోక్‌సభలో కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వీగిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు చట్టసభల్లో ౩౩ శాతం ప్రాతినిధ్యం కల్పించే తమ ప్రయత్నాన్ని కాంగ్రెస్, డీఎంకే అడ్డుకున్నాయని ఆరోపించారు. సాధారణ కుటుంబాల నుంచి వచ్చే మహిళలు చట్టసభల్లో అడుగుపెట్టడం విపక్షాలకు ఇష్టం లేదని ఆయన మండిపడ్డారు.

బిల్లును విద్వేషంతోపాటు నీచమైన రాజకీయాలకు వాడకున్నాయని దుయ్యబట్టారు. మహిళా సాధికారతకు ఆటంకం కలిగించిన వారికి ప్రజలు బుద్ధిచెప్పాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. బిల్లు ఆమోదం పొంది ఉంటే తమిళనాడు నుంచి ఎంతోమంది మహిళలు ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యేవారని తెలిపారు. నల్ల బట్టలు ధరించి నిరసన తెలిపినంత మాత్రాన డీఎంకే తన నల్లటి పనులను దాచుకోలేదని ఎద్దేవా చేశారు.

మహిళలకు రక్షణ కల్పించడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కేంద్ర క్యాబినెట్ సమావేశంలోనూ.. ఢిల్లీలో తన అధ్యక్షతన నిర్వహించిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలోనూ ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ల కోసం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై తీవ్ర అసంతప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

బిల్లును వీగిపోయేలా చేసిన విపక్షాలు జీవితాంతం మూల్యం చెల్లించుకుంటాయని శపించినట్లు సమాచారం. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇవ్వకుండా ప్రతిపక్ష పార్టీలు పెద్ద తప్పు చేశాయని, ఈ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి సాకులు వెతుకుతున్నాయని కేంద్ర మంత్రుల ముందు వ్యాఖ్యానించినట్లు తెలియవచ్చింది.