సిద్దిపేటలో రైతు ఉత్సవాల సందడి
- మూడు రోజుల పాటు మహోత్సవం
రైతు సంక్షేమమే ధ్యేయం.. నర్మెట్టలో ఉత్సవాలను విజయవంతం చేయండి:మంత్రులు పొన్నం, తుమ్మల
నంగునూరు, మార్చి 19:సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఈనెల 22వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే ’ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు ముఖ్యమంత్రి బహిరంగ సభకు రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.ఉగాది పండుగ రోజున (గురువారం) నిర్వహించిన రైతు ఉత్సవాలకు రైతులు విశేషంగా స్పందించారని మంత్రులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదే ఉత్సాహంతో 20, 21, 22 తేదీలలో జరిగే కార్యక్రమాల్లో కూడా రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ముఖ్యంగా ఆయిల్ ఫామ్ తోటల పెంపకం, వ్యవసాయ యాంత్రీకరణపై శాస్త్రవేత్తలు అందించే మెలకువలను రైతులు అందిపుచ్చుకోవాలని సూచించారు.వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన ఉద్యానవన, పాడి పరిశ్రమ, మత్స్య రంగాల ద్వారా అధిక దిగుబడులు సాధించేందుకు ఈ ఉత్సవాలు ఒక వేదికగా నిలుస్తాయని మంత్రులు పేర్కొన్నారు. 22వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం పండుగలా జరగాలని, రైతు లోకం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.




