కిడ్నీ దానం చేసిన తల్లి... దక్కని కొడుకు ప్రాణం
కల్హేర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం రాపర్తి గ్రామానికి చెందిన ఈర్ల సాయిలు అనే యువకుడు కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. కొంతకాలంగా సాయిలు కిడ్నీ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నారు. కుమారుడి ప్రాణాలను కాపాడుకోవాలనే తపనతో ఆయన తల్లి తన కిడ్నీని దానం చేయడంతో కొంతకాలం ఆరోగ్యంగా ఉన్నారు.
అయితే విధి మరోలా నిర్ణయించినట్లు తిరిగి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో చికిత్స పొందుతూనే సాయిలు సోమవారం తుదిశ్వాస విడిచారు. కుమారుడి ప్రాణం కోసం తల్లి అవయవదానం(Organ donation) చేసినప్పటికీ కుమారుడిని కాపాడుకోలేకపోవడం స్థానికులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. యువకుడి అకాల మరణంతో రాపర్తి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కలచివేశాయి.






