దొంగతనాన్ని అడ్డుకున్న మహిళా కార్మికురాలు
- జీఎం ఎన్. రాధాకృష్ణ ప్రశంసలు
బెల్లంపల్లి,(విజయక్రాంతి): సింగరేణి సంస్థ ఆస్తులను కాపాడటంలో ఓ మహిళా కార్మికురాలు చూపిన ధైర్య సాహసాన్నీ అందరూ ప్రశంసించాలి. వివరాలిలావున్నాయి. మందమర్రి ఏరియాలోని కేకే ఓపెన్ కాస్ట్ (KKOC) బేస్ వర్క్‌షాప్ జనరల్ అసిస్టెంట్ ఎం. శ్రీలత పనిచేస్తున్నారు. కేకే ఓపెన్ కాస్ట్ బేస్ వర్క్‌షాప్‌లో మొదటి షిఫ్ట్‌లో ఉన్న శ్రీలత, వర్క్‌షాప్‌లోని విలువైన సామాగ్రిని అదే గనిలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి దొంగతనంగా తరలిస్తుండటం గమనించారు. ఏమాత్రం తడబడకుండా ఆమె సదరు వ్యక్తిని పట్టుకొని, వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
ఆమె సమయస్ఫూర్తి ధైర్య సాహసం సంస్థ ఆస్తి చోరీకి గురికాకుండా అడ్డుకుంది. ఈ విషయంలో శ్రీలత ప్రదర్శించిన ధైర్యo, బాధ్యతాయుత ప్రవర్తనను గుర్తించిన ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ, మంగళవారం తన కార్యాలయంలో ఆమెకు "ప్రశంసా పత్రం" అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా జీఎం రాధాకృష్ణ మాట్లాడుతూ.. సంస్థ పట్ల అంకితభావంతో పనిచేసే ఇలాంటి కార్మికులు అందరికీ ఆదర్శమని కొనియాడారు. విధుల్లో అప్రమత్తంగా ఉండి సంస్థ ఆస్తులను కాపాడటంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ రవి, పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.




