3 April, 2026 | 5:13 AM

విద్యార్థినులు ఆత్మరక్షణ విద్యల్లో ప్రావీణ్యం పొందాలి

03-04-2026 12:00 AM

సిద్దిపేట క్రైం, ఏప్రిల్ 2 : ప్రతి విద్యార్థిని ఆత్మరక్షణ విద్యల్లో ప్రావీణ్యం సాధించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఆకాంక్షించారు. చిన్నకోడూర్ మండలం పెద్దకోడూర్ గ్రామంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల వార్షికోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి విద్యార్థిని ఒక ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని, అది నెరవేరేవరకు కఠినంగా శ్రమించాలని పిలుపునిచ్చారు.

క్రమశిక్షణ, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని వారిలో స్ఫూర్తిని నింపారు. సోషల్ మీడియా వినియోగంపై విద్యార్థినులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదైనా ఆపద లేదా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు ’డయల్ 100’ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు సిద్దిపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెలలో ’సిద్దిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర’ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ స్నేహలత, రూరల్ సీఐ శ్రీను, స్థానిక ఎస్‌ఐ చంద్రమోహన్, అధ్యాపకులు, పోలీసులు అధికారులు పాల్గొన్నారు.