05-02-2026 12:32:02 AM
రాత్రి పడిందంటే వణుకుతున్న గ్రామీణులు
నిర్లక్ష్యపు ధోరణిలో అటవీ శాఖ అధికారులు
తాడ్వాయి, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు చిరుత పులి సంచారంతో వణికిపోతున్నారు. రాత్రి పడిందంటే చాలు ఎక్కడి నుంచి చిరుత పులి వస్తుందోనని భయం గుప్పెట్లో మగ్గుతున్నారు. ఇటీవల చిరుత పులి దాడులతో రైతుల లేగ దూడలు, ఆవులు బలి అయ్యాయి. అయినా సదరు అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యపు ధోరణినే అవలంబిస్తున్నారు. తమకు ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామ శివారులో వ్యవసాయ పొలం వద్ద కట్టేసి ఉంచిన లేగ దూడను చిరుత పులి దాడి చేసి హతమార్చింది. గ్రామానికి చెందిన సంకు రాజు అనే రైతు తన వ్యవసాయ పొలంలో రెండేళ్ల లేగ దూడను కట్టేసి ఉంచాడు. మంగళవారం రాత్రి చిరుత పులి కట్టేసి ఉంచిన లేగ దూడ పై దాడి చేసి హతమార్చింది. బుధవారం ఉదయం రైతు పొలం వద్దకు వెళ్లి చూడగా పక్కనే ఒర్రె లో లేగ దూడ మృతదేహం పడి ఉంది. దీంతో రైతు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దీని విలువ రూ.35 వేల వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు.
నిద్రమత్తులో అటవీశాఖ అధికారులు..
మండలంలోని గ్రామాలలో రాత్రి సమయంలో చిరుత పులి పశువులపై దాడి చేస్తూ హతమార్చడంతో రైతులు భయపడుతున్నారు. అటవీశాఖ అధికారులు నిద్రమత్తును వీడడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో పొలాల వద్దకు వెళ్లాలంటేనే భయమేస్తుందని వాపోతున్నారు. ఇటీవల మండలంలోని ఎర్రపహాడ్, దేమికలాన్ గ్రామాల శివారులలో పులి సంచారం చేసి పశువులపై దాడి చేసి హతమార్చింది. అయినా అధికారులు స్పందించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి చిరుత పులి సంచారాన్ని నిరోధించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. చిరుత పులి దాడిలో మృతి చెందిన పశువులకు పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.