బలమైన కార్తుల బలం ఖతం
చినుకు జాడలేక రైతు వెన్నులో వణుకు
ఖరీఫ్లో మొఖం చాటేసిన అసలైన కార్తులు
ఈ ఏట ఖరీఫ్ పంటలకు గడ్డుకాలమేనా
చేవెళ్ల, జులై 6 (విజయక్రాంతి): ఖరీఫ్ సీజన్లో తెలంగాణ ప్రాంత మెట్ట రైతులు కార్తి బలం మీదే నమ్ముకుని పంటలు సాగు చేస్తారు. ఏడాది పొడవునా ఇంటి గాసం (పశువుల మేత) సహా ఇతరత్రా కుటుంబ అవసరాలన్నింటికీ ఈ ఖరీఫ్ పంటలే ప్రధాన ఆధారం. ముఖ్యంగా రోహిణి, మృగశిర, ఆరుద్ర కార్తులే ఖరీఫ్ పంటలకు అత్యంత బలమైన కార్తులుగా భావిస్తారు.రోహిణి కార్తీ అదనులో విత్తిన విత్తనంలో కనీసం రెండు మొలకలు మొలిస్తే చాలని రైతులు సరిపెట్టుకుంటారు.
అదే మృగశిర కార్తీలో విత్తిన విత్తనం మూడు మొలకలు మొలిచినా, ఆరుద్ర కార్తీలో విత్తిన విత్తనం ఆరు మొలకలు మొలిచినా చివరికి పంట దిగుబడి మాత్రం ఒకేలా ఉంటుందని రైతుల అపార నమ్మకం. అందుకే మెట్ట రైతులు పల్లెల్లో రోహిణి కార్తీలోనే విత్తనం వేసేందుకు ఎక్కువగా సుముఖత చూపుతారు. అయితే, ఈ ఏడాది వర్షాలు సకాలంలో పడకపోవడంతో మెట్ట రైతుల పరిస్థితి తీవ్ర అయోమయంగా మారింది.
మెట్ట పంటలకు కార్తుల బలమే ముఖ్యం....
ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో రైతులు మెట్ట పంటల సాగుకే తొలి ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా రోహిణి, మృగశిర, ఆరుద్ర కార్తుల్లో జొన్నలు, మొక్కజొన్నలు, కందులు, పెసర్లు, అనుములు, మినుములు, ఉలవలు, కొర్రలు, సజ్జలు వంటి పంటలను విత్తుతారు. ఈ పంటలన్నింటినీ అటు ఇటుగా ఆరుద్ర కార్తీ లోపే పూర్తి చేస్తారు.
ఏప్రిల్ - మే మాసాల నుండి పొతం (దుక్కి) చేసి సిద్ధం చేసుకున్న పొలాల్లో ఇదివరకు కొంతమంది రైతులు విత్తనాలు విత్తినప్పటికీ, ఆశించిన స్థాయిలో మొలకలు రాలేదు. పదును తగలకుండా భూమిలోనే ఉండిపోయిన విత్తనాలు ఆరుద్ర కార్తిలో కురిసే వర్షాలకు మొలకెత్తే అవకాశం ఉంటుందని ఆశించారు. కానీ ఆరుద్ర కార్తిలో కూడా వర్షం కురవకుండా మొఖం చాటేయడంతో, ఎరువులు విత్తనాలకు భారీగా పెట్టుబడి పెట్టి విత్తనాలు వేసిన రైతన్న ముఖం చిన్నబోయింది.
రైతును ఊరిస్తున్న వరుణుడు
వరుణ దేవుడు వర్షం కురవాలా వద్దా అన్నట్లుగా ఆకాశాన్ని మేఘావృతం చేస్తున్నాడే తప్ప చినుకు మాత్రం నేల రాల్చడం లేదు. ఇప్పుడే వస్తుంది అన్నట్లుగా మేఘాలు గర్జిస్తున్నప్పటికీ వాతావరణం చల్లబడుతుందే తప్ప పూర్తిస్థాయిలో చినుకు పుడమిని తాకడం లేదు. మృగశిర కార్తి నుంచి అయినా వర్షం కురవకపోతుందా అని రైతన్నలు ఎంతో ఆశతో ఆరుద్ర కార్తి వరకు కూడా వేచి చూశారు, అయినా ఫలితం లేకుండా పోయింది.
పొలాల్లో పంటలు ఎసలడం లేదు..
మృగశిర, రోహిణి కార్తు ల్లో విత్తిన విత్తనాలు పొలాల్లో అక్కడక్కడా మొలకెత్తినప్పటికీ పంట మాత్రం ఎసలడం (ఏపుగా పెరగడం) లేదు. అప్పు డప్పుడు రాలుతున్న అరకొర చినుకులు మొక్కల ఆకులను తడుపుతున్నాయే తప్ప, వర్ష పు నీరు మొక్కల వేర్ల వరకు చేరడం లేదు. మొలక ప్రా యంలో ఉన్న మొక్క వేరుకు తగినంత వర్షపు నీరు అం దడం తప్పనిసరి. చినుకు రాలకపోవడంతో మొక్కలన్నీ కలతప్పి ఎండిపోయే దశకు చేరుకున్నాయి.
పత్తి రైతు ఇంద్రపాటి భూపాల్ రెడ్డి చేవెళ్ళ
మందులు, కూలీల ఖర్చు మోపెడు..
నేడు వ్యవసాయం చేసే రైతులకు ఎరువులు, మందులు, కూలీల ఖర్చులు మోపెడు అవుతున్నాయి. ఖరీఫ్ సీజన్లో విత్తనాలు వేసేందుకు విపరీతంగా ఖర్చు పెరుగుతోంది. ప్రతి ఏట జూన్ - జూలై మాసాలు రైతులకు కత్తిమీద సాము లాంటివి. ఒకపక్క పంటల పెట్టుబడులు, మరోపక్క ఇదే సమయంలో పిల్లల చదువుల ఫీజుల ఖర్చులు తోడై మోపెడవుతున్నాయి. ఈ క్రమంలో తీవ్ర వర్షాభావం ఏర్పడటంతో పెట్టుబడులు సైతం దక్కవనే ఆందోళనతో రైతుల ముఖాలు పూర్తిగా అవిసిపోయాయి.
పత్తి రైతు ఇంద్రపాటి భూపాల్ రెడ్డి చేవెళ్ళ






