7 July, 2026 | 2:40 AM

కేసముద్రం మార్కెట్‌లో అన్ని అలంకారప్రాయం..!

07-07-2026 01:11 AM

లక్షలు వెచ్చించారు నిర్లక్ష్యంగా వదిలేశారు 

మహబూబాబాద్, జూలై 6 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ గా గుర్తింపు పొందిన కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో లక్షల రూపాయలు వెచ్చించి అనేక వసతులు ఏర్పాటుచేసి వాటిని వినియోగంలోకి తేకుండా వదిలేయడంతో అలంకారప్రాయంగా మారాయి. జాతీయస్థాయిలో ఉత్తమ సేవలకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు పొంది ఈ నామ్ విధానాన్ని అమలు చేస్తూ కీర్తి గడించిన కేసముద్రం మార్కెట్ లో అనేక సౌకర్యాలు ఇప్పుడు అలంకారప్రాయంగా మారాయని విమర్శలు వస్తున్నాయి. 

మూడేళ్లుగా మూతపడ్డ ఆరోగ్య కేంద్రం

కేసముద్రం మార్కెట్ కు వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించడానికి వచ్చిన రైతులకు, వ్యాపారులకు, కార్మికులకు, విధుల్లో ఉన్న అధికారులు సిబ్బందికి అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే వైద్యం అందించేందుకు ప్రత్యేకంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. అయితే మూడేళ్లుగా డాక్టర్ను నియమించకపోవడంతో ప్రైమరీ హెల్త్ సెంటర్ నిరుపయోగంగా మారింది. ప్రతి ఏటా కొంత బడ్జెట్ కేటాయించి మందులు, డాక్టర్ వేతనం చెల్లించాల్సి ఉండగా, వాటికి నిధులు కేటాయించి వినియోగించాల్సి ఉండగా ఆ దిశగా చర్యలు చేపట్టక కోరుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రస్తుతం అలంకారప్రాయంగా మారింది. 

బోర్డు ఏర్పాటు చేశారు.. డిస్ప్లే మరిచారు

సుమారు 22 లక్షల రూపాయల వ్యయంతో కేసముద్రం మార్కెట్ యార్డులో రైతులకు సంబంధించిన వివరాలు, ధరల పట్టికలు ప్రదర్శించేందుకు ఏర్పాటుచేసిన డిస్ప్లే బోర్డు వినియోగించకుండా వదిలేశారు. మార్కెట్కు వ్యవసాయ ఉత్పత్తులు తీసుకువచ్చిన రైతుల వివరాలతో పాటు ఇతర అంశాలు ఎప్పటికప్పుడు మార్కెట్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన భారీ డిజిటల్ డిస్ప్లే బోర్డులో ప్రదర్శించాల్సి ఉంటుంది. బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటివరకు వినియోగంలోకి తేకపోవడంతో అలంకారప్రాయంగా మారింది. 

నాణ్యత ల్యాబ్ కు మంగళం

ఈ నామ్ విధానం అమలులో భాగంగా రైతులు విక్రయించడానికి తెచ్చిన పంట ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించి ఆ మేరకు నాణ్యతను ఈ టెండర్ విధానంలో పొందుపరిచి రైతులకు నాణ్యతకు తగ్గ ధరను ఇప్పించేందుకు మార్కెట్లో నాణ్యత నిర్ధారణ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే తాజాగా ఈ నామ్ 2.0 వెర్షన్ కొత్తగా అమలు చేయడంతో నాణ్యత నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని వినియోగించడానికి కొత్త వెర్షన్ లో ఇంకా ప్రతిపాదనలు రాకపోవడంతో అలంకారప్రాయంగా మారింది. 

మూతపడ్డ మహిళా శక్తి క్యాంటీన్

కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కు వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించేందుకు వచ్చిన రైతులకు నాణ్యతతో కూడిన అల్పాహారం అందించడానికి గత రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేయించింది. ఇందుకోసం మార్కెట్ యార్డులో ఐదు రూపాయలకు భోజనం పథకం పక్కనే ఉన్న గదిని కేటాయించి అన్ని సౌకర్యాలు కల్పించింది. అయితే మొదట్లో మహిళా శక్తి క్యాంటీన్ నిర్వహణ చేపట్టిన మహిళా సంఘాల ప్రతినిధులకు ఆశించిన విధంగా వ్యాపారం సాగడం లేదని మూసివేశారు. అప్పటినుండి ఇప్పటివరకు మహిళా శక్తి క్యాంటీన్ తిరిగి పునః ప్రారంభించడానికి చర్యలు తీసుకోకపోవడంతో తాళం పడింది.