7 July, 2026 | 3:05 AM

రాష్ట్ర సాధనలో చౌదరి అజిత్ సింగ్ కృషి

07-07-2026 02:06 AM
  1. ఆయన విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై పెట్టాలి
  2. టీఆర్‌ఎల్డీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్‌కుమార్ డిమాండ్

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర లోక్ దళ్ (టీఆర్‌ఎల్డీ) ఆధ్వర్యంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎల్డీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు విశేష కృషి చేసిన దివంగత చౌదరి అజిత్ సింగ్ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్ఠించాలని, అంబర్‌పేట్ ఫ్లైఓవర్‌కు చౌదరి అజిత్ సింగ్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు.

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో చౌదరి అజిత్ సింగ్ తెలంగాణ ఉద్యమానికి సంఘీభావంగా వరంగల్‌లో జరిగిన టీఆర్‌ఎస్ ప్రజాగర్జన సభలో పాల్గొన్నారని, తెలంగాణకు మద్దతు తెలిపిన కారణంగా తన కేంద్ర మంత్రి పదవిని కూడా కోల్పోయారని గుర్తు చేశారు. అయినప్పటికీ ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనకు తన మద్దతును చివరి వరకు కొనసాగించారని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు టీఆర్‌ఎల్డీకి ఐదుగురు ఎంపీలు, రాజ్యసభలో ఏకైక సభ్యుడు కూడా తెలంగాణ బిల్లుకు మద్దతుగా ఓటు వేశారని తెలిపారు.

చౌదరి అజిత్ సింగ్ మార్గదర్శకత్వంలోనే 2012లో తెలంగాణ రాష్ట్ర లోక్ దళ్ ఏర్పాటు చేయబడిందని, తెలంగాణ ఉద్యమంలో పార్టీ ముందుండి చురుకైన పాత్ర పోషించిందని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులపై అమలులో ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను తక్షణమే రద్దు చేసి, పాత పెన్షన్ విధానంను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో చౌదరి అజిత్ సింగ్ చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించి ఆయనకు తగిన గౌరవం ఇవ్వాలని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బీరప్ప కోరారు.

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సెప్టెంబర్ 26న ఖమ్మంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర యువజన అధ్యక్షులు రాజ్ కుమార్ ప్రకటించారు. ఈ నెల 11న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు హైదరాబాద్ లోని హోటల్ సెంట్రల్ కోర్ట్, లక్షీకాపూల్ లో మూసీ ప్రాజెక్టు, దానికి సంబంధించిన అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు దిలీప్ కుమార్ తెలిపారు.

ఈ సమావేశానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీలు రవీందర్ రావు, అద్దంకి దయాకర్, సామాజికవేత్తలు, రాజకీయ నాయకులు, మేధావులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు విశాల్ (ప్రధాన కార్యదర్శి), ఓంకార్ (కార్యదర్శి), నరసింహారావు (ప్రధాన కార్యదర్శి), బీరప్ప, రిషబ్ జైన్ (ప్రధాన కార్యదర్శి), గిరి కుందే (కోశాధికారి), బుల్లెట్ వెంకన్న, దివాకర్ గౌడ్, రాజ్కుమార్ (రాష్ట్ర యువజన అధ్యక్షులు), కోటేశ్వర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.