రోడ్డెక్కిన అన్నదాతలు
- ధాన్యం, మక్కలు కొనాలని డిమాండ్
- మద్దతు పలికిన బీఆర్‌ఎస్ నేతలు
వరంగల్ (మహబూబాబాద్)/ ఆదిలాబాద్/బేల/కామారెడ్డి, మే 2 (విజయ క్రాంతి): ధాన్యం, మక్కలు కొనాలని డిమాం డ్ చేస్తూ శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. వారికి బీఆర్‌ఎస్ నేతలు మద్దతు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన మక్కలను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వరంగల్ ప్రధాన రహదారిపై గురిజాల క్రాస్ వద్ద రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 42 కొనుగోలు కేంద్రాలను పునరుద్ధరించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. పిఎసిఎస్, ఎఫ్పివో, ఐకెపి మహిళా సంఘాలకు కొనుగోలు కేంద్రాలను ఇవ్వాలన్నారు. 90 వేల ఎకరాలలో మొక్కజొన్న పంట దిగుబడి వస్తే కేవలం 7 కొనుగోలు కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేసి రైతులను ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆరోపించారు.
ప్రైవేట్ వ్యాపారస్తులకు, దళారులకు కొమ్ము కాస్తూ రైతులకు మద్దతు ధర లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందుల పాలు చేస్తుందని ఆరోపించారు. రాస్తారోకో వల్ల భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న నేతలను అడ్డు తొలగించారు. కామారెడ్డి మండలం తిమ్మక్ పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన వద్ద ధాన్యం కాంటలు పెట్టడం లేదని, మరికొన్ని చోట్ల ధాన్యం కొనుగోలు చేపట్టడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు చేరుకొని సంబంధిత అధికారులను పిలిచి రైతులతో మాట్లాడించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పెరికిట్ చౌరస్తాలో రైతులు రాస్తారోకో నిర్వహించారు.
జాతీయ రహదారిపై ఎడ్లబండ్లతో నిరసన..
శనగ పంటను కొనుగోలు చేయాలంటూ ఆదిలాబాద్ జిల్లా జైనథ్, బేల మండలాల్లో చేపట్టిన రైతుల నిరసనకు బీఆర్‌ఎస్ నేతలు మద్దతు పలికారు. కొబ్బాయి గ్రామంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి జోగు రామన్న రైతుల పక్షాన ఆందోలనకు దిగా రు. జాతీయ రహదారిపై శనగ పంటను కుప్పలుగా పోసి రోడ్డుపై బైటాయించి రాస్తారోకో చేయడంతో రోడ్డుకు ఇరువైపుల భారీ గా వాహనాలు నిలిచిపోయాయి.
దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించిన ఫలితం లేకపోయింది. జోగు రామన్న మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి మారితే తప్ప రైతుల పరిస్థితి మారదన్నారు. రైతులు పండించిన శనగ, జొన్న పంటలను ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోళు చేయాలని డిమాండ్ చేశారు.






