ధాన్యం కొనుగోలు చేపట్టాలని రైతుల రోడ్డుపై ధర్నా
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు ఇబ్బందులు..
పుల్లూరు స్టేజ్ వద్ద ఆందోళనకు బీఆర్‌ఎస్ మద్దతు..
సిద్దిపేట రూరల్, మే 19: ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించి రైతుల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట–ముస్తాబాద్ ప్రధాన రహదారి(Siddipet–Mustabad Main Road)పై పుల్లూరు స్టేజ్ వద్ద రైతులు సోమవారం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు సక్రమంగా పనిచేయకపోవడంతో రోజుల తరబడి కొనుగోలు కోసం ఎదురుచూడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు ప్రక్రియలో జాప్యం కారణంగా వర్షాలు వస్తే ధాన్యం తడిసి నష్టపోయే ప్రమాదం ఉందని, రైతుల కష్టాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, సంబంధిత అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. రైతుల ధర్నాకు మద్దతుగా బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి, కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని ఆలస్యం లేకుండా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ భూమయ్యగారి కిషన్‌రెడ్డి, గడ్డం తిరుపతి రెడ్డి, దశరథం, రైతు సంఘాల నాయకులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.






