19 May, 2026 | 3:04 PM

గద్వాలలో పట్టు చీరల దొంగల కలకలం

19-05-2026 01:32 PM

వెంబడించి పట్టుకున్న స్థానికులు.

గద్వాల టౌన్: గద్వాల పట్టణంలోని కిష్టారెడ్డి బంగ్లా సమీపంలో సోమవారం పట్టు చీరల దొంగతనం కలకలం రేపింది.స్థానికుల అప్రమత్తతతో ఆటోలో పరారవుతున్న ముగ్గురు నిందితులు పోలీసుల చేతికి చిక్కారు.వివరాల్లోకి వెళ్తే ఎప్పుడూ రద్దీగా ఉండే కిష్టారెడ్డి బంగ్లా ప్రాంతంలోని ఓ పట్టు చీరల దుకాణంలోకి ఇద్దరు మహిళలు కస్టమర్ల ముసుగులో ప్రవేశించారు.దుకాణదారుల దృష్టి మళ్లిన సమయంలో విలువైన పట్టు చీరలను అపహరించి ముందుగానే సిద్ధంగా ఉంచిన ఆటోలో అక్కడి నుంచి పారిపోయారు.ఈ ఘటనను గమనించిన స్థానిక వ్యాపారులు వెంటనే అప్రమత్తమై ఆటోను వెంబడించారు.

కొంతదూరం వెళ్లిన తర్వాత ఆటోను అడ్డగించి అందులో ఉన్న ఆటో డ్రైవర్‌తో పాటు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.సమాచారం అందుకున్న 9వ వార్డు కౌన్సిలర్ రామలింగేశ్వర కాంబ్లే ఘటనాస్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.అనంతరం పట్టణ 2వ ఎస్ఐ జహంగీర్ సిబ్బందితో కలిసి ముగ్గురిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.నిందితులు కర్నూలు జిల్లా చెన్నమ్మ సర్కిల్ సమీపానికి చెందిన చెంచు వర్గానికి చెందిన వారిగా ప్రాథమిక విచారణలో తెలిసినట్లు సమాచారం.ఇదే ప్రాంతంలోని పట్టు చీరల దుకాణాల్లో గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.తాజా ఘటనలో సమయస్ఫూర్తితో స్పందించి నిందితులను పట్టుకున్న స్థానికులను పలువురు అభినందించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.