జొన్న,మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకై రైతుల ధర్నా
గాంధారి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో బాన్సువాడ-కామారెడ్డి ప్రధాన రహదారిపై నెహ్రూ చౌరస్తా వద్ద మండలంలోని రైతులు భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు విఠల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని అన్నారు.
మండలంలోని రైతులు ఎక్కువ విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేస్తారని అధికారులకు అవగాహన ఉన్నా కూడా ఇప్పటివరకు మొక్కజొన్న, జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం చాలా దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చేతికి వచ్చిన పంట వర్షంలో తడిస్తే తమ పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు, ప్రభుత్వానికి విన్నవించినా రైతుల గోడు పట్టించుకోవడం లేదని ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల సమస్యలు తీర్చాలని వారు డిమాండ్ చేశారు.
యూరియా యాప్ రైతులకు శాపం..
యూరియా యాప్ రైతులకు శాపంగా పరిణమించింది అని, యాప్ పై అవగాహన లేని రైతులు యూరియా ఎలా బుక్ చేసుకుంటారని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా సరఫరా యాప్ ద్వారా కాకుండా నేరుగా ప్రతీ రైతుకు సరిపడా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యదర్శి శంకర్ రావ్, జిల్లా రెవెన్యూ ప్రముఖ్ రావు సాహెబ్ రావ్, మండల అధ్యక్షుడు మాధవరావు, కార్యదర్శి భూపతి, నర్సింలు, ఆనంద్ రావ్ , మండలంలోని రైతులు పాల్గొన్నారు.






