17 August, 2026 | 11:49 AM

రైతులు పురుగుమందుల పిచికారీలో అప్రమత్తంగా ఉండాలి

17-08-2026 10:53 AM

కుభీర్ ఆగస్ట్ 17(విజయక్రాంతి ): పురుగుమందుల పిచికారీ సమయంలో రైతులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్, కృష్ణ నర్సింగ్ హోమ్, భైంసా హెచ్చరించారు. ముధోల్ తాలూకా రైతులకు పురుగుమందుల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన అవగాహన కల్పించారు. పంటలకు పురుగుమందులు పిచికారీ చేసే సమయంలో రైతులు తప్పనిసరిగా మాస్క్, గ్లౌవ్స్, రక్షణ దుస్తులు ధరించాలని సూచించారు. పురుగుమందులను చేతులతో నేరుగా కలపకుండా తగిన రక్షణ పరికరాలు ఉపయోగించాలని తెలిపారు. గాలి వీచే దిశకు ఎదురుగా నిలబడి పిచికారీ చేయకూడదని, విషవాయువులు పీల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పిచికారీ పూర్తయిన వెంటనే చేతులు, ముఖం, శరీరాన్ని శుభ్రంగా కడుక్కోవాలని, ఆ సమయంలో ఆహారం తీసుకోవడం, నీరు తాగడం, పొగతాగడం వంటివి చేయకూడదని తెలిపారు. పురుగుమందుల ప్రభావంతో తలతిరగడం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఇతర అస్వస్థత లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. రైతుల ఆరోగ్యం, కుటుంబ భద్రతకు చిన్నపాటి జాగ్రత్తలే పునాది అని, అప్రమత్తతతో పురుగుమందుల విషప్రభావాన్ని నివారించవచ్చని డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ తెలిపారు.