1 August, 2026 | 3:27 AM

వరిలో ‘స్ఫడ్’ దుష్ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి

01-08-2026 02:14 AM
  1.    3050 శాతం నష్టం వచ్చే ప్రమాదం
  2. వ్యవసాయ శాస్త్రవేత్త డా. పల్లవి

సిద్దిపేట, జూలై 31 (విజయక్రాంతి): వ్యవసాయ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, సిద్దిపేట శాస్త్రవేత్త డా. పల్లవి జిల్లాలోని పలు గ్రామాల్లో వరి పొలాలను సందర్శించి పంట పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా వరి నారు మడులు, ప్రధాన పొలాల్లో ‘స్ఫడ్’ దుష్ప్రభావం కనిపిస్తున్నట్లు గుర్తించారు. వానాకాలం, వేసవికాలంలో ఒకే పొలంలో సంవత్సరాల తరబడి వరి సాగు చేయడం, అధిక నీటి ముంపు, వేర్లకు తగినంత గాలి అందకపోవడం, నేలలో రసాయన మార్పులు చోటుచేసుకోవడం వంటి కారణాలతో ఈ సమస్య తలెత్తుతుందని ఆమె తెలిపారు.

దీని వల్ల 30 నుంచి 50 శాతం వరకు దిగుబడి నష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇనుము ధాతువు లోపం ఉన్న భూములు, బరువు నేలలు, అలాగే 20-20-0-13 వంటి గంధకం కలిగిన ఎరువులు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా అమ్మోనియం సల్ఫేట్ను అధికంగా వినియోగించే పొలాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని వివరించారు. చెరువుల కింద, కాలువల పరిధిలో ఎప్పుడూ నీరు నిల్వ ఉండే భూముల్లో కూడా స్ఫడ్ దుష్ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పారు.

ఈ దుష్ప్రభావం ఉన్న పొలాల్లో వరి మొక్కలు గుంపులుగా పసుపు రంగులోకి మారి ఎదుగుదల మందగించడం, మట్టి మెత్తగా మారి కాళ్లు లోతుగా దిగిపోవడం, బుడగలు బయటకు రావడం, దుర్వాసన వెదజల్లడం, మొక్కల వేర్లు నల్లగా మారి కుళ్లిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో మొక్కలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం కూడా ఉందన్నారు.

ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా సిద్దిపేట జిల్లాలో నాట్లు వేసిన అనేక పొలాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని డా. పల్లవి పేర్కొన్నారు. నివారణ చర్యల్లో భాగంగా నారు మడి సిద్ధం చేసే ముందు 12 బండ్ల ఎర్రమట్టి లేదా చెరువు మట్టిని కలిపి భూమిని ఎత్తుగా తయారు చేయాలని సూచించారు. పొలంలో నీరు నిల్వ లేకుండా సమతలీకరణ చేయడంతో పాటు, దుష్ప్రభావం కనిపిస్తే వెంటనే మురుగు నీటిని తొలగించి పొలాన్ని కొంతకాలం ఆరబెట్టి, అనంతరం అవసరమైన మేరకు నీటిని అందించాలని తెలిపారు.

అమ్మోనియం సల్ఫేట్ వంటి ఎరువులను వాడకుండా ఉండాలని సూచించారు. అదేవిధంగా 25 కిలోల యూరియాలో 100150 గ్రాముల స్ప్రింట్ (కార్బెండజిమ్ + మాంకోజెబ్) కలిపి ఎకరానికి వేయడం లేదా కాంటాఫ్ ప్లస్/హెక్సాకొనజోల్ 2 మి.లీ.ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే స్ఫడ్ దుష్ప్రభావాన్ని గణనీయంగా తగ్గించి పంటను కాపాడుకోవచ్చని రైతులకు సూచించారు.