నేరెళ్ళలో రైతులకు వానాకాల సాగుపై అవగాహన
తంగళ్ళపల్లి, మే 18 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ళ గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించారు. వానాకాలంలో సాగు చేసే పంటలు, సన్న వరి రకాల ఎంపిక, ఎరువుల వినియోగం, నీటి సంరక్షణ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.శాస్త్రవేత్త డాక్టర్ టి. అరుణ్ బాబు మాట్లాడుతూ వరి, పత్తి, మొక్కజొన్న పంటల్లో యూరియా వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. పచ్చిరొట్ట, జీవన, సేంద్రీయ ఎరువుల వాడకం వల్ల భూమి సారవంతం పెరిగి దిగుబడులు మెరుగుపడతాయని తెలిపారు. రైతులు వరికి బదులుగా పెసర, మినుములు, బొబ్బర్లు, కుసుమ, సోయాబీన్ వంటి పంటలను సాగు చేయాలని సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేసిన కూనారం వరి-2, తెలంగాణ సోనా, సిద్ధి, సాంబ మసూరి వంటి సన్న వరి రకాలను సాగు చేయాలని రైతులకు సూచించారు. రసాయనాల వినియోగాన్ని అవసరమైన మేరకే పరిమితం చేసి సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి కే. సంజీవ్ మాట్లాడుతూ రైతులు శాస్త్రవేత్తలు సూచించిన పద్ధతులను అమలు చేసి సాగు ఖర్చులు తగ్గించుకొని అధిక లాభాలు పొందాలని సూచించారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగుకు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ వివరాలను రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేరెళ్ళ సర్పంచ్ పొన్నం లక్ష్మణ్, ఉపసర్పంచ్ రాజమణి లక్ష్మీనరసింహం, వ్యవసాయ విస్తరణ అధికారి మౌనిక, విద్యార్థి రాకేష్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.






