యూరియా కోసం రైతుల ఆందోళన
రోడ్డుపై పడుకుని నిరసన
మెదక్/చేగుంట, మార్చి 7 (విజయక్రాంతి): యూరియా దొరక్కపోవడంతో శనివారం మెదక్ జిల్లా చేగుంటలో రైతులు రోడ్డు పైకి వచ్చి ఆందోళన చేపట్టారు. చేగుంటలోని ఆగ్రో సేవా కేంద్రానికి 450 బస్తాల యూరియా రావడంతో రైతులు పెద్ద సంఖ్యలో చేరుకుని యూరియా కోసం బారులు తీరారు. వచ్చిన యూరియా కొద్దిమందికే సరిపోవడంతో మిగ తా రైతులకు ఎరువు అందలేదు. కేవలం 14 నిమిషాల్లోనే యూరియా అయిపోయిందని ఆగ్రోస్ కేంద్రం యాజమాన్యం చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ప్రధాన రోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు.
పంటల సాగు కీలక దశలో ఉన్న సమయంలో యూరియా అందుబాటులో లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తగినంత యూరియా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుం టామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు.




