16 July, 2026 | 3:02 PM

ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరం

16-07-2026 02:44 PM

ఘట్ కేసర్ తహసిల్దారు చంద్రశేఖర్

ఘట్ కేసర్,(విజయక్రాంతి): భారత ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ  ప్రక్రియను మరింత పటిష్టంగా, పారదర్శకంగా, ప్రజలకు చేరువ చేసే దిశగా స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఘట్ కేసర్ తహసీల్దారు చంద్రశేఖర్ అన్నారు. ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ చౌదరిగూడ పరిధిలోని వెంటాద్రి టౌన్ షిప్ ఫేస్ 1,2,3, స్వర్ణగిరి, విజయపురి కాలనీలలో స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విజ్ఞాన్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల కొండాపూర్ కు చెందిన దాదాపు 40 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సర్ ప్రక్రియలో భాగంగా బిఎల్ఓలతో కలసి ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి వివరాలతో ఫారం పూర్తిచేసే విధంగా, పూర్తిచేసిన ఫారాలను తీసుకోవడం, ఓటర్ అవగాహన కార్యక్రమాన్ని  తహసీల్దారు చంద్రశేఖర్ బుధవారం పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజల్లో అవగాహన పెంపొందించడం, అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో తన పేరును నమోదు చేసుకునేలా ప్రోత్సహించడం, అవసరమైన ఫారాలను సక్రమంగా నింపడంలో సహకరించడం వంటి అంశాల్లో స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్ల అవసరం ఎంతైన ఉందని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ, యువత, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు తదితర వర్గాలకు అవసరమైన సహాయాన్ని అందించడం ద్వారా స్వచ్ఛంద సంస్థలు ప్రజాస్వామ్య బలోపేతానికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.

ఎన్నికల యంత్రాంగం సమన్వయంతో స్వచ్ఛంద సంస్థల సేవాభావం కలిసివస్తేనే ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదు కావడంతో పాటు ఖచ్చితమైన, విశ్వసనీయమైన ఓటరు జాబితా రూపొందుతుందని ఆయన అభిప్రాయ పడుతున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు చంద్రశేఖర్, ఆర్ఐ కావ్య, స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ల యాదగిరి, బిఎల్ఓలు, విజ్ఞన్స్ కళాశాల పిడి కోటేశ్వరరావు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.