8 March, 2026 | 1:59 AM

వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి 5,257 కోట్లు మంజూరు

08-03-2026 12:14 AM

హైదరాబాద్, మార్చి 7 (విజయక్రాంతి): వరంగల్ నగరంలో సమగ్ర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) వ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో ఫేజ్ అమలు చేయనున్న యూజీడీ ప్రాజెక్టుకు రూ.5,257.20 కోట్లకు పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి శనివారం ఉత్తర్వులు జారీచేశారు.

ఈ ప్రాజెక్టుకు జర్మనీకి చెందిన అభివృద్ధి సంస్థ కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు ఆర్థిక సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. జర్మన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు వరంగల్‌లో పర్యటించి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహించిన తరువాత ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా అంగీ కారం తెలిపారు.

ఇప్పటికే తయారైన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) ప్రకారం ప్రాజె క్టు వ్యయం రూ.5,257.20 కోట్లుగా అంచనావేశారు. దీనికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ పోర్టల్లో ప్రాథమిక ప్రాజెక్టు నివేదికను అప్లోడ్ చేయాలని కేఎఫ్‌డబ్ల్యూ సూచించింది. ప్రాజెక్టుకు నిధులను 50 శాతం ఎక్ట్సర్నల్ అసిస్టెన్స్, 25 శాతం కేంద్ర ప్రభుత్వ సహాయం, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద సమీకరించనున్నారు.