8 March, 2026 | 1:57 AM

అవినీతి ఎమ్మార్వో

08-03-2026 12:17 AM
  1. గజ్వేల్ తహసీల్దార్‌పై అక్రమాస్తుల కేసు
  2. ఏసీబీ దాడుల్లో కోట్ల అక్రమాస్తుల గుట్టు రట్టు
  3. కరీంనగర్‌లో ఇళ్లు, ఫ్లాట్లు, ఖాళీ స్థలాల గుర్తింపు 

కార్లు, బంగారు నగలు, లక్షల్లో నగదు స్వాధీనం

అధికారికంగా రూ.4 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు

బహిరంగ మార్కెట్‌లో రెట్టింపు 

నిందితుడు శ్రవణ్ కుమార్ అరెస్టు

కరీంనగర్ క్రైమ్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): తహసీల్దార్‌గా పనిచేస్తూ కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టిన అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది. కరీంనగర్ పట్టణానికి చెందిన కమటం శ్రవణ్ కుమార్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్‌గా పనిచేస్తున్నాడు. కమటం శ్రవణ్ కుమార్‌పై ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు శనివారం నిర్వహించిన సోదాల్లో భారీ స్థాయిలో అక్రమ సంపాదన వెలుగులోకి వచ్చింది. ఈ సోదాల్లో అక్రమంగా కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు తేలింది.

ఏసీబీ అధికారులు నిందితుడి నివాసంతో పాటు మరో రెండు ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించారు. కరీంనగర్ పట్టణంలో రెండు ఇళ్లు, ఆరు ఫ్లాట్లు కలిగిన ఒక అపార్టుమెంట్, నాలుగు ఖాళీ స్థలాలు బయటపడ్డాయి. ఈ స్థిరాస్తుల విలువ సుమారు రూ.2.47 కోట్లుగా అధికారులు అం చనా వేశారు. రెండు ద్విచక్ర వాహనాలు, ఒక నాలుగు చక్రాల వాహనం, బంగారు నగలు, గృహోపకరణాలు, భారీ నగదు గుర్తించారు.

రెం డు ద్విచక్ర వాహనాల విలువ రూ.1.60 లక్షలు, నాలుగు చక్రాల వాహనం విలువ సుమారు రూ.30 లక్షలుగా నమోదు చేశారు. బంగారు నగలు సుమారు రూ.4.20 లక్షలు ఉండగా, గృహోపకరణాల విలువ రూ.15.66 లక్షలుగా అంచనా వేశారు. అదనంగా రూ.11.90 లక్షల నగ దు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో బయటపడిన స్థిర, చరాస్తుల మొత్తం విలువ సుమారు రూ.4 కోట్లకు పైగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అధికారిక అంచనాల కంటే మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని పేర్కొన్నారు.

ప్రభుత్వ పదవిని దుర్వినియోగం చేసి ఈ ఆస్తులు కూడబెట్టినట్లు సోదాల్లో లభించిన పత్రాలు సూచిస్తున్నాయని తెలిపారు. ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరచి న్యాయ నిర్బంధానికి తరలించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. అక్రమ సంపాదనకు సం బంధించిన మరిన్ని వివరాలు వెలికితీసేందుకు దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.