3 April, 2026 | 3:37 AM

పారాక్వాట్ నిషేధంపై రైతు కమిషన్ హర్షం

03-04-2026 01:56 AM
  1. దేశవ్యాప్తంగా నిషేధం విధించాలి 

సీఎం, మంత్రికి ధన్యవాదాలు తెలిపిన రైతు కమిషన్ 

హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పారాక్వాట్ గడ్డి మందు నిషేధించడం హర్షించదగ్గ విషయమని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. గురువారం రైతు కమిషన్ కార్యాలయంలో కమిష న్ చైర్మన్, సభ్యులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అత్యంత విషపూరితమైన పారా క్వాట్ నిషేధించడానికి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో విడుదల చేయడం సంతోషక రమన్నారు.

ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు లకు రైతు కమిషన్ బృందం ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పింది. పారాక్వాట్ వల్ల వందలాది మంది రైతులు తమ ప్రాణాలను కోల్పోయారని ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ గుర్తుచేశారు. రాష్ట్రంలో గడ్ది, కలుపు మందులను నిషేధించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రైతు సంఘాల నేతలు రైతు కమిషన్ దృష్టికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

దీంతో రైతు కమిషన్ క్షేత్ర స్థాయిలో పర్యటించి, నిపుణులతో రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేసి.. పారాక్వాట్‌ను నిషేధించాలని కమిషన్ ప్రభుత్వాన్ని కోరిందన్నారు. రైతు కమిషన్ సూచన మేరకు అసెంబ్లీలో తీర్మానం పెట్టడం, బుధవారం జీవో విడుదల చేయడం సంతోషమన్నారు. దేశంలో కూడా నిషేధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం కూడా శుభపరిణామని తెలిపారు. రైతులు కూడా విషపూరితమైన గడ్డి కలుపు మందుల వైపు వెళ్లొద్దని కమిషన్ చైర్మన్, సభ్యులు కోరారు.  సమావేశంలో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి, భూమి సునీల్ వున్నారు.