బీఆర్‌ఎస్, బీజేపీలకు బుద్ధి చెబుతాం..
నీటి విడుదలపై అసత్య ప్రచారం మానుకోవాలి
ఎమ్మెల్యే కృషితోనే నీటిని విడుదల చేశారని
ఆర్జీపీఆర్‌ఎస్ అధ్యక్షులు త్రిమూర్తి వెల్లడి
లక్సెట్టిపేట, ఆగస్టు 10: ప్రకృతి వైపరీత్యాలను రాజకీయం చేస్తున్న బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలకు గట్టిగా బుద్ధి చెబుతామని ఆర్జీపీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి హెచ్చరించారు. సోమవారం ఐబీలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక నాయకులతో కలిసి మాట్లాడారు. ఇటీవల జిల్లాలో సంవృద్దిగా కురిసిన వర్షాలకు కడెం ప్రాజెక్ట్ నిండటంతో, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు రాష్ట్ర స్థాయిలో అధికారులతో మాట్లాడి సాగుకు నీటి విడుదలకు కృషి చేశారన్నారు.
రైతుల పంటలకు చివరి వరకు నీరు సరిపోయేలా ప్రణాళిక ప్రకారం విడుదల చేయడానికే కేవలం వారం రోజులు సంబంధిత అధికారులు వేచి చూడాల్సి వచ్చిందన్నారు. కడెం ప్రాజెక్ట్ లోని నీటిని తక్షణమే పూర్తి స్థాయిలో విడుదల చేస్తే, పంట చివరి దశలో ఇబ్బందులు రావద్దనే ఆలోచించామన్నారు. ప్రతిపక్ష నాయకులు తమ పాదయాత్ర, ధర్నాలకు భయపడి నీటిని విడుదల చేశారనడం అబద్దమని వివరించారు. రైతులను పక్కదారి పట్టించాలనే ప్రతిపక్ష నాయకులకు బుద్ధి లేదని విమర్శించారు.
అంతకుముందు మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్ లు ఆవాకులు,చేవాకులు పేలవద్దని హితబోధ చేశారు. అసత్య ప్రచారంతో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును ఇబ్బంది పెడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, పార్టీ పట్టణ అధ్యక్షులు షాహిద్ అలీ, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు, సర్పంచ్ లు నలిమేల రాజు, బానేష్, రాజేశం, నాయకులు దొంత నర్సయ్య, మడిపెల్లి స్వామి, సుమన్, కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు.






