ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ఫేక్ జీవోలు
కీలక సూత్రధారి నిందితుడు రాధాకృష్ణ అరెస్ట్
శేరిలింగంపల్లి, మే 31 (విజయక్రాంతి); సచివాలయంలో అటెండర్గా పనిచేసి డిప్యూటీ కలెక్టర్ అవతారమెత్తాడు. ఉద్యోగాల పేరుతో కోట్లు కొల్లగొట్టి చివరకు ఫేక్ జీవోలతో ప్రభుత్వ భూమికే ఎసరు పెట్టాడు. గండిపేట సర్వే నెం.18లోని విలువైన భూమిని కాజేసేందుకు పన్నిన భారీ కుట్రను సైబరాబాద్ నార్సింగి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కీలక సూత్రధారి వేలాది రాధాకృష్ణ, 53, అతని డ్రైవర్ గ్యారా ప్రవీణ్కుమార్, 34,లను పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.
2006 నుంచి 2009 వరకు ఏపీ సచివాలయంలో ఐటీ విభాగంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా చేరిన రాధాకృష్ణ, అక్కడే ప్రభుత్వ ఫైళ్ల తతంగం ఒంటపట్టించుకున్నాడు. ఆ తర్వాత ఉద్యోగం వదిలేసి, తాను డిప్యూటీ కలెక్టర్నని, లాయర్నని బిల్డప్ ఇచ్చాడు. 2013లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.30 లక్షలు వసూలు చేయడంతో కరీంనగర్లో తొలిసారి కేసు నమోదైంది. ఆ తర్వాత నల్గొండలో అటెండర్ ఉద్యోగం పేరుతో రూ.18 లక్షలు, మొయినాబాద్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉద్యోగం పేరుతో రూ.3 లక్షలు దండుకున్నాడు.
ఇలా రాజేంద్రనగర్, నేరేడ్మెట్, గోదావరిఖని, కర్నూలు, కరీంనగర్లలో మొత్తం తొమ్మిది కేసులు అతని చుట్టూ అల్లుకున్నాయి. ఉద్యోగాల దందాతో విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన రాధాకృష్ణ కన్ను... భూములపై పడింది. డ్రైవర్ ప్రవీణ్ ద్వారా కొవ్వూరు సునీల్తో చేతులు కలిపి, గండిపేట సర్వే నెం.18 భూమిపై కన్నేసిన నిమ్మల రాజేశ్, వేణుగోపాల్, రామస్వామి, గారెల మంగ గ్యాంగ్తో జతకట్టాడు.
ప్రభుత్వ పోరంబోకు భూమి అని తెలిసి కూడా, ఏపీకి చెందిన నేత బ్రహ్మనాయుడు, అతని సోదరుడు రమేశ్కు ఆ భూమిని రెగ్యులరైజ్ చేయిస్తానని, వారసత్వ హక్కులు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు.అంతటితో ఆగకుండా ఓ లాయర్ సాయంతో నకిలీ జీవోలు, సీసీఎల్‌ఏ ప్రొసీడింగ్స్, ఎన్‌ఓసీలు సృష్టించాడు. సీనియర్ ఐఏఎస్ అధికారుల సంతకాలను సైతం ఫోర్జరీ చేసి, అచ్చం అసలు ఉత్తర్వుల్లా తయారు చేశాడు.
ఈ మాయాజాలంలో కొవ్వూరు సునీల్, కరణం రాజేశ్, ప్రభుదాస్లు డబ్బు చేరవేత, డాక్యుమెంట్ల రవాణా చేస్తూ కీలకంగా వ్యవహరించారు. ఈ భారీ డీల్లో బ్రహ్మనాయుడు, రమేశ్లకు, భూమి యజమానుల ముసుగులో ఉన్నవారికి మధ్య ఏకంగా రూ.12 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో బట్టబయలైంది.కేసు బయటపడటంతో పరారైన రాధాకృష్ణకు డ్రైవర్ ప్రవీణ్ అండగా నిలిచాడు. డాక్యుమెంట్లు దాచిపెట్టి, పోలీసుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ తప్పించే ప్రయత్నం చేశాడు.
సాంకేతిక ఆధారాలతో ఇద్దరినీ పట్టుకున్న పోలీసులు వారి నుంచి ఐదు ల్యాప్టాప్లు, 13 రబ్బర్ స్టాం పులు, 12 చెక్బుక్లు, ఏడు బ్యాంకు పాస్బుక్లు, పది ఏటీఎం కార్డులు, 31 భూముల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఫేక్ జీవోలతో ప్రభుత్వ భూములను కబ్జా చేసే వ్యవస్థీకృత ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.






