04-02-2026 01:59:19 AM
జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన కలెక్టర్
ఖమ్మం టౌన్, ఫిబ్రవరి 3 (విజయ క్రాంతి): ఖమ్మం రూరల్ మండలంలోని తీర్దాల సంగమేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి సందర్భంగా జాతర నిర్వహణకు విస్తృతంగా ఏర్పాటు చేయాలని, ప్రణాళిక ప్రకారం నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని తన చాంబర్ లో మంగళవారం తీర్థాల మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 18 వరకు 5 రోజుల పాటు మహా శివరాత్రి జాతర వేడుకలను అత్యంత వైభవోపేతంగా తీర్థాలలో నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి సన్నద్ధ మయ్యే విధంగా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా దాదాపు నాలుగు లక్షల మంది భక్తులు ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల గ్రామంలో ఉన్న సంగమేశ్వర స్వామి దేవాలయానికి విచ్చేసి స్వామి వారిని దర్శించు కునే అవకాశం ఉందని, గతం కంటే భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు.