16 July, 2026 | 1:37 AM

సీఎం రేవంత్‌రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు

16-07-2026 01:25 AM

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి 

భూపాలపల్లి, జులై 15 (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ లో అనుచిత వ్యాఖ్యలు చేశారని, సీఎంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల సీఎం నిర్వహించిన ప్రెస్మీట్ కార్యక్రమంలో రాష్ట్రంలో రాబోయే సూపర్ ఎల్ నినో, కరవు పరిస్థితులపై ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తోందని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా సమాధానం ఇస్తూ, ఈ కరవు సమస్య తీరాలంటే ప్రతిపక్ష నాయకులు కే. చంద్ర శేఖర్ రావు,

తన్నీరు హరీష్ రావు,  కేసీఆర్ కుటుంబ సభ్యులు, రైతుల రక్తాన్ని తెలంగాణ పొలాల్లో చిందించడానికి కూడా నేను సిద్ధమే అని వ్యాఖ్యానించారని, అంతేకాకుండా, ఈ ప్రతిపక్ష నాయకులు ‘తమ ఒంటికి బండరాయి కట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టులో దూకి చావాలి, అప్పుడే తెలంగాణకు వీరి నుండి శాశ్వతంగా విముక్తి లభిస్తుంది’ అని ప్రత్యక్షంగా, బహిరంగంగా మీడియా సాక్షిగా ఒక్క ముఖ్యమంత్రి మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఈ రోజు భూపాలపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ని స్వయంగా కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీబీ జీ కే ఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజీరెడ్డి బిఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.