calender_icon.png 13 February, 2026 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుట్టలు మాయం!

13-02-2026 12:00:00 AM

తవ్వేస్తున్న వ్యాపారులు..

కళ్ళు మూసుకుంటున్న అధికారులు..

దర్జాగా వ్యాపారం..

తాడ్వాయి, ఫిబ్రవరి, 12 (విజయక్రాంతి): ఒకప్పుడు ప్రకృతి అందాలకు నిలయమైన గుట్టలు నేడు అంద వికారంగా గుంతలతో కనిపిస్తున్నాయి. అడిగే వారు ఎవన్నా ధీమాతో కొందరు వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా ఇష్టమొచ్చినట్లు గుట్టలను తవ్వేస్తూ కాసులు సంపాదిస్తున్నారు. అక్రమంగా తవ్వుతున్న గుట్టలను నిరోధించాల్సిన అధికారులు కళ్ళు మూసుకుని వెళ్ళిపోతున్నారు. కొందరు రాజకీయ నాయకులు ఇదే అదునుగా భావించి నాయకుల అండదండలతో మట్టిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.

ఎక్కడ గుట్టలు కనబడితే అక్కడ తవ్వకాలు జరుపుతూ మట్టిని తరలిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో కొందరు రాజకీయ నాయకులకు ఇది ఒక మంచి వ్యాపారంగా మారింది.ఎలాగైనా డబ్బులు సంపాదించుకోవాలనే లక్ష్యంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టా రీతిగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో తాడువాయి, లింగంపేట, గాంధారి, మాచారెడ్డి, సదాశివనగర్, నిజాంసాగర్, బాన్సువాడ,పిట్లం మండలాలలో కొందరు రాజకీయ నాయకులు ఇదే అవకాశంగా మలచుకొని వ్యాపారన్ని సాగిస్తున్నారు.

తాడ్వాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత గుట్టను కొందరు కాంట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్లు గుట్టను తవ్వేస్తుండటంతో గుట్ట మైదానంగా మారిపోతుంది. ఒకప్పుడు ప్రకృతి అందాలకు నిలయంగా ఉన్న తాడ్వాయి గుట్ట మరికొన్ని సంవత్సరాలలో గుట్ట కనబడకుండా పోతుందేమోనని ప్రజలు భావిస్తున్నారు. అప్పట్లో గుట్టలు ఎలా ఉండే అని ఆశ్చర్యపోయే స్థాయికి మారిపోతుందేమోనని స్థానికులు వాపోతున్నారు. 

ప్రభుత్వ అనుమతులు లేకుండానే తవ్వకాలు 

- - మట్టిని తవ్వాలంటే ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి.ప్రభుత్వం అనుమతి ఇస్తేనే మట్టని తవ్వాలి. తరలించాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే తరలిస్తున్నారు.మైనింగ్ శాఖ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. ఒక నిర్దిష్ట స్థానంలో తవ్వకాలు జరుపుతామని అధికారులకు రాతపూర్వకంగా దరఖాస్తు పెట్టుకోవాలి. ఈ దరఖాస్తు ను పరిశీలించి అధికారులు సంబంధిత ఏరియా ను పరిశీంచి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. అనుమతులు పొందిన అనంతరం వ్యాపారులు మట్టి తవ్వకాలు ప్రారంభించాలి.

కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే ఇష్టం వచ్చినట్లు గుట్టలను తవే్వ్స్తూ మట్టిని తరలిస్తున్నారు.తమ ఇష్టానుసారంగా మట్టిని తవ్వి టిప్పర్ల లో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో టిప్పర్ కు ఒక్కో రేట్ నిర్ణయించి అమ్ముకుంటున్నారు. తాడ్వాయి మండలంలోని దేమికలాన్, కన్కల్, ఎర్ర పహాడ్, కృష్ణాజివాడి, బ్రహ్మాజీవాడి,చిట్యాల ప్రాంతాలలో తవ్వకాలు జరుపుతూ మట్టిని తరలిస్తున్నారు. 

ప్రభుత్వ ఆదాయానికి గండి 

- - కొందరు కాంట్రాక్టర్లు వ్యాపారులు తమ ఇష్టం వచ్చినట్లు గుట్టలను తవ్వుతూ మట్టిని తరలిస్తుండడం తో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. ప్రభుత్వానికి రావలసిన ఆదాయం రాకుండా పోతుంది.ప్రభుత్వ అనుమతులు తీసుకొని మట్టిని తవ్వితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.మైనింగ్ శాఖ కు డబ్బులు చెల్లించకపోవడంతో డబ్బులు రావడం లేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు స్పందించాలి

ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమంగా తరలిపోతున్న మట్టిని తరలి పోకుండా కాపాడాలని కోరుతున్నారు.దందా చేస్తున్న రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతున్న అధికారులపై పై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇప్పటికీ అధికారులు స్పందించకుంటే ప్రకృతి అందాలతో కనిపిస్తున్న గుట్టలు మాయమైపోయే ప్రమాదం ఉందని ప్రజలు చెబుతున్నారు.