అంతా పొంగులూటీ
- నాదర్‌గుల్ సీలింగ్ భూముల కబ్జా వెనుక మంత్రి పొంగులేటి హస్తం
- 2016లో భూములను కాపాడింది మేమే
- ప్రభుత్వ భూములైతే హైడ్రా ఎక్కడికి పోయింది?
- మంత్రి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు కౌంటర్
వనపర్తి, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): నాదర్‌గుల్‌లోని 373 ఎకరాలు ప్రభుత్వ సీలింగ్ భూములేనని, వీటిని కబ్జా చేసి చుట్టూ ఫెన్సింగ్, బోర్డులు ఏర్పాటు చేస్తున్నారని, ఈ కబ్జాల వెనుక సాక్షాత్తూ రెవె న్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన కుటుంబ హస్తం ఉందని బయటపెట్టడంతోనే మంత్రి అబద్ధాలను మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. శిల్పా ఇన్‌ఫ్రా, రాఘవ ఎల్‌ఎల్‌పీల్లో మంత్రి పొంగులేటి కుమారుడు డైరెక్టర్ కాదా? అని ప్రశ్నించారు.
ఈ భూముల కబ్జా వెనుక మంత్రి, ఆయన కుటుంబం హస్తం ఉందని స్పష్టం గా తేలిపోయిందని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా రాఘవ కన్‌స్ట్రక్షన్ గురించి సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాడని మా అధికారు లు గుర్తు పట్టారని పెనాల్టీ వేశామని శాసనసభలో చెప్పాడని, మైనింగ్ మంత్రి సైతం చెప్పాడని వివరించారు. రెవెన్యూ, విద్యుత్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు రాఘవ క్రషర్‌కు నోటీసులు ఇచ్చారని చెప్పింది తప్పా అని నిలదీశారు.
సచివాలయంలో బుధవారం మంత్రి పొం గులేటి మాట్లాడిన మాటలకు హరీశ్ రావు కౌంటరిచ్చారు. గురువారం వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, లక్ష్మా రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, రాష్ట్ర నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, నాగం తిరుపతిరెడ్డిలతో కలిసి మాట్లాడారు. సరుకులేనప్పుడు తిట్ల రాగాన్ని అందుకున్నట్లు మంత్రి మాటలను చూస్తుంటే అర్థం అవుతుందని ఆరోపించారు.
రాఘవ కన్‌స్ట్రక్షన్ సంస్థను కాపాడు కోవాలని, బయటపడాలనే తాపత్ర యం కనిపించిందన్నారు. తాను ఒక్కడే కాదు రాష్ట్రంలోని మరికొందరి కుంభకోణాలు బయటపెట్టె ప్రయత్నం కనిపించిందని, దీంతో ఆయన పొంగులేటి కాదు పొంగులూటి అని చెప్పకనే చెప్పాడని విమర్శించారు. రాఘవ క్రషర్ సంస్థపై అసెంబ్లీలో, బయట అధికారు లు ప్రశ్నిస్తే ఎందుకు సమాధానం చెప్పలేకపోయావని హరీశ్ రావు నిలదీశారు. 12 రోజుల తరువాత గుర్తుకొచ్చిందా? అని ప్రశ్నించారు.
మైనింగ్ శాఖ నోటీసులిస్తే మీ అధికారి సంత కం పెట్టింది నిజం కాదా అని నిలదీశారు. 2016 బీఆర్‌ఎస్ హయాంలో ఈ భూముల ను నిషేధిత జాబితాలో పెట్టి కాపాడింది తామేనని, హైకోర్టు, డివిజన్ బెంచ్‌లకు కంపెనీలు పోతే కూడా ఈ భూములు సీలింగ్ భూ ములను అని తీర్పు వచ్చింది వాస్తవం కాదా? అని ఆయన గుర్తు చేశారు. ఏకేస్కేర్ లో మీ కుమారుడు భాగస్వామి కాదా? కోహినూర్, శిల్ప రోజుకొక బోర్డు ఎందుకు మారుతుందని ప్రశ్నించారు.
ప్రభుత్వ భూమిలో పేదలు ఇళ్ల నిర్మాణం చేపడితే రాత్రికి రాత్రే కూలగొట్టే మీ ప్రభుత్వం ఈ కబ్జాను ఎందుకు ఉపేక్షిస్తున్నారని, నాదర్‌గుల్ భూములు ప్రభుత్వ భూములైతే హైడ్రా ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. మైనింగ్‌పై సీఎం రేవంత్, అధికారులు, మంత్రి ఇలా భిన్నరకాల వాదనలు, వ్యాఖ్యలలో పూర్తిగా అసత్యం ఉందని వెంటనే అసెంబ్లీ సాక్షిగా మంత్రి పొంగులేటి ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.




