ఆమనగల్‌లో ‘కో-ఆప్షన్’ సెగ
- మున్సిపాలిటీలో మాటల మంటలు కోరం ఉన్నా ఎన్నిక వాయిదా వేస్తారా?
- బీఆర్‌ఎస్ నిరసన పారిపోలేదు.. పనులపై వెళ్లాను: చైర్మన్ వీడియో విడుదల
ఆమనగల్, ఏప్రిల్ 23(విజయక్రాంతి): ఆమనగల్ మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. రాజకీయ సమీకరణాల మధ్య నాటకీయ పరిణామాలు చోటుచేసుకోవడంతో, గురువారం జరగాల్సిన ఎన్నిక సోమవారం కు వాయిదా పడింది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల మధ్య చోటుచేసుకున్న సవాళ్లు, ప్రతిసవాళ్లతో మున్సిపల్ కార్యాలయం వద్ద హైడ్రామా నడిచింది.మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం ఉదయం 11 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు.
ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్ణీత సమయానికి బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఏడుగురు కౌన్సిలర్లు యశోదమ్మ, రాము, జగన్, రమేష్, అనూష, భాగ్యలక్ష్మి, ఆంజనేయులు కార్యాలయానికి చేరుకొని సమావేశం కార్యాలయం లో తమకు కేటాయించిన కుర్చీ లో కూర్చున్నారు.
మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్ సైతం వచ్చి తమ చంబర్లో కూర్చొన్నారు.అయితే, అనూహ్యంగా బీజేపీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు ఈ ప్రక్రియకు గైర్హాజరయ్యారు. బీజేపీ కౌన్సిలర్లు రాకపోయినప్పటికీ, ఎన్నిక నిర్వహించడానికి అవసరమైన ’కోరం’ (కనీస సభ్యుల సంఖ్య) తమకు ఉందని, వెంటనే ఎన్నిక జరపాలని బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు పట్టుబట్టారు. కానీ, అధికారులు ఎన్నికను శుక్రవారం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
మున్సిపల్ ఆఫీస్ వద్ద బీఆర్‌ఎస్ ఆందోళన..
ఎన్నికల నిర్వహణ అధికారి వ్యవహారశైలిపై బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు మండిపడ్డారు. ‘ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తి కోరం ఉన్నా ఎన్నిక ఎందుకు వాయిదా వేశారు? దీని వెనుక ఉన్న మతలబు ఏంటి?‘ అని వారు నిలదీశారు. చైర్మన్ పత్యనాయక్ తన ఛాంబర్ నుంచి వెళ్ళిపోవడాన్ని తప్పుబడుతూ, ఆయన భయపడి పారిపోయారని ఆరోపిస్తూ మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు. పారిపోవడానికి నేను రౌడీషీటర్ని కాదు...బీఆర్‌ఎస్ నేతల ఆరోపణలపై చైర్మన్ పత్యా నాయక్ తీవ్రంగా స్పందించారు.
ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ ఎదురుదాడికి దిగారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, మున్సిపాలిటీ పరిధిలో ముందుగా నిర్ణయించిన అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం వెళ్లానని స్పష్టం చేశారు. ‘ఒక మాజీ రౌడీషీటర్ అవగాహన లేకుండా నాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. కో-ఆప్షన్ ప్రక్రియ హాల్లో జరుగుతుంటే, బయట ఆవరణలో గొడవ చేయడం ఏంటి?‘ అని ఆయన ప్రశ్నించారు. తమకు పూర్తి కోరం ఉందని, రాజకీయ లబ్ధి కోసమే బీఆర్‌ఎస్ నేతలు అనవసరంగా రభస చేస్తున్నారని విమర్శించారు.
రేపటిపై ఉత్కంఠ..
కో ఆప్షన్ ఎన్నికకు నిందిత గడువు లేక కోరమ్ సభ్యులు హాజరుకానందున ఎన్నికను ర సోమవారం వాయిదా వేసినట్లు మున్సిపల్ కమిషనర్ శంకర్ నాయక్ తెలిపారు కో ఆప్షన్ ఎన్నిక పై అందరి దృష్టి శుక్రవారం సమావేశం పై పడింది. రేపు కూడా ఇదే తరహా ఉద్రిక్తత కొనసాగుతుందా? లేక సజావుగా ఎన్నిక ముగుస్తుందా? అన్నది వేచి చూడాలి. ప్రస్తుతం ఆమనగల్ రాజకీయాల్లో ఈ ‘మాటల మంటలు‘ హాట్ టాపిక్ గా మారాయి






