ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి
మొయినాబాద్ ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): మొయినాబాద్ మండలంలోని ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని తహసీల్దార్ గౌతమ్ కుమార్ సూచించారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, మీసేవ కేంద్రాల మేనేజర్లు, గ్రామ పరిపాలన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గౌతమ్ కుమార్ మాట్లాడుతూ.. ఆధార్ ద్వారా దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు కల్పించినట్లుగానే ప్రతి రైతుకు 14 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయించే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చెయ్యాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.
భూమి కలిగిన ప్రతి రైతుకు సంబంధించిన భూ యజమాన్య వివరాలు వ్యక్తిగత సమాచారం ఆధారంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ రూపొందించబడుతుందని, ఆయన చెప్పారు. పీఎం కిసాన్ పథకం తదుపరి విడుదల లబ్ధి పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్లో తప్పనిసరిగా నమోదు ఉండాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. రాబోయే వర్షాకాలం సీజన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అయిన రైతు భరోసా, రుణమాఫీ, మొక్కజొన్న, పత్తి, ధాన్యం కొనుగోలు ఇతర ఎరువుల పంపిణీకి ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవుతుందని అన్నారు. ఏప్రిల్ 24వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు మండలంలోని రైతు వేదికలో ప్రత్యేక డ్రైవ్ ఉంటుందని, రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో దండెం విజయ చంద్ర, ఏఈవోలు సునీల్ కుమార్, ఏ.కుమార్, వరుణ్ కుమార్, గ్రామ పరిపాలన అధికారులు, మీసేవ కేంద్రాల మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.






