ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి
పల్స్ పోలియో కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ అంకిత్
పాల్వంచ, జూన్ 28, (విజయక్రాంతి): ఐదు సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఆదివారం జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా పాల్వంచ ఇందిరా నగర్ కాలనీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లాలో ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించకుండా మిగిలిపోకుండా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు.
ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన చిన్నారులకు ఈ నెల 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లే ఆరోగ్య సిబ్బంది ద్వారా పోలియో చుక్కలు వేయిస్తామని తెలిపారు. ప్రయాణాల్లో ఉన్న కుటుంబాలు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ఇటుక బట్టీలు, వ్యవసాయ పనులు, నిర్మాణ ప్రదేశాలు, ఇతర పని ప్రదేశాల్లో ఉన్న చిన్నారులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారి తుకారాం రాథోడ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.






