పోషకాహార గనులు పుస్తకావిష్కరణ
ఐఐఎంసీలో ఆరోగ్యమే మహాభాగ్యం సందేశంతో కార్యక్రమ నిర్వహణ
హైదరాబాద్, ఆగస్టు 7(విజయక్రాంతి): లక్డికపూల్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) లోని తెలుగు శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత సుబ్బయ్య మలసాన రచించిన ‘పోషకాహార గనులు’ పుస్తకావిష్కరణ సభ కళాశాలలోని చల్లా సోమ రాజ్ రామ్ సభా ప్రాంగణంలో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా సభకు అధ్యక్షత వహించిన ఐఐఎంసీ చైర్మన్ ఆచార్య వంగపల్లి విశ్వనాథం మాట్లాడుతూ ఆరోగ్యం ప్రాధాన్యతను తెలుపుతూ ఈ పుస్తకంలోని విషయాల ద్వారా ఆరోగ్యం ఏ విధంగా సంరక్షించుకోవచ్చో తెలియజేశారు. ముఖ్య అతిథి ఉమ్మడి రాష్ట్ర మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని పుస్తక రచయిత మలసాన సుబ్బయ్య చేతుల మీదుగా గౌరవ అతిథి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాంస్కృతిక విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రజా సంబంధాల అధికారి పి.మోహన్‌రావుకు అందజేశారు.
అనంతరం దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి రోజు సరైన పోషకాహారం తింటూ ప్రతిరోజు వ్యాయామం చేస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలియజేశారు.పోషకా పోషకార గనుల పుస్తకాన్ని సుబ్బయ్య 80 సంవత్సరాల వయసులో ఆరు సంవత్సరాలు కష్టపడి తెలుగులో రాసారని అందులో మన ఆరోగ్యానికి సంబంధించిన ఎంతో సమాచారం ఉందని తెలియజేస్తూ సుబ్బయ్యని అభినందించారు.
గౌరవ అతిథి మోహన్‌రావు మాట్లాడుతూ పోషకాహార గనుల పుస్తకం ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేస్తుందని నేటి యువత ఆరోగ్యంపై దృష్టి సారించడం లేదని ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పుడే మనం జీవితంలో విజయం సాధిస్తామని తెలియజేశారు. అధ్యాపకురాలు శిష్ట్లా మాధవి, ప్రిన్సిపాల్ కూర రఘువీర్ తదితరులు మాట్లాడారు.
పుస్తక రచయిత సుబ్బయ్య మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతతో కూడిన హక్కు అని, వైద్య విద్య, ఆరోగ్య పరిజ్ఞానం దాచవలసిన అవసరం కాని, రహస్యం కానే కాదు అని పేర్కొన్నారు. కళాశాల తెలుగు శాఖ అధ్యక్షు లు ఇ. రామకృష్ణ అతిథులను వేదికపై ఆహ్వానించగా డాక్టర్ మలసాన సాహితి వందన సమర్పణతో సభను ముగించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డీన్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, అధ్యాపకులు,అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, సుబ్బయ్య స్నేహితులు పాల్గొని పుస్తకావిష్కరణ సభను విజయవంతం చేశారు.






