20 August, 2026 | 3:55 PM

అధికారంలోనూ ఫెయిల్.. ప్రతిపక్షంలోనూ బీఆర్ఎస్ ఫెయిల్

20-08-2026 03:08 PM

హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను తిప్పికొట్టారు. పదేళ్ల పాలనలో ఆస్తులు, ఆర్థిక సామర్థ్యం ఎలా పెరిగిందో ప్రజలకు వివరించాలని కోరారు. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేశారు. అవినీతిపై హరీశ్ రావు మాట్లాడటం హంతకుడే సంతాపం తెలిపినట్లుగా ఉందని విమర్శించారు. 

హరీష్ రావు, పదేళ్లపాటు మీరంతా ఎలాంటి అవినీతికి పాల్పడ్డారో మీరు ఎలా మర్చిపోగలరు? స్వయంగా మీ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితనే అనేక సందర్భాల్లో దీని గురించి ప్రస్తావించారు కదా? అని మంత్రి ప్రశ్నించారు. పదేళ్లలో ఇంత భారీగా ఆస్తులు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో కమీషన్లతో పనులు జరిగాయని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వంలోనూ జరుగుతుందని అనుకోవడం బీఆర్ఎస్ భ్రమే అన్నారు. బీఆర్ఎస్ తమ భ్రమలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తోందని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. అధికారంలోనూ ఫెయిల్... ప్రతిపక్షంలోనూ బీఆర్ఎస్ ఫెయిల్ అయ్యిందని మంత్రి పొంగులేటి విమర్శించారు.