వెయ్యేళ్లయినా బీఆర్‌ఎస్ మారదు
- జీవన్‌రెడ్డి తెలంగాణకు పచ్చి వ్యతిరేకి
- కేంద్రాన్ని బీఆర్‌ఎస్ పల్లెత్తుమాట అనలే
- గుంటనక్కతో గుంపు మేస్త్రీ డీల్
- కోర్టు తీర్పులను ప్రభావితం చేసేలా సీఎం వ్యాఖ్యలు
- ప్రతిపక్షం లేకుండా చేస్తామంటే ప్రజలు తీసి బొంద పెడుతరు
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ వెయ్యేళ్లయినా మారదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బీఆర్‌ఎస్ తొవ్వలోనే కాంగ్రెస్ పార్టీ వెళ్తోం దని విమర్శించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మంగళవారం మీడియాతో కవిత మాట్లాడారు. ఓటమిపై బీఆర్‌ఎస్ ఇప్పటికీ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదని, ప్రజలే తప్పు చేశారని ప్రజలను చులకన చేసి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
75 సంవత్సరాల కురువృద్ధుడిని చేర్చుకుని ఆయనకే 25 ఏండ్లు తగ్గిపోయిన నవ యువకుడు అంటే తెలంగాణలో ఉన్న యువత పరిస్థితి ఏంటని? కవిత ప్రశ్నించారు. తాము ఏర్పాటు చేసే పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని, యువత పెద్ద ఎత్తున చేరాలని పిలుపునిచ్చారు. జగిత్యాల సభలో 75 ఏళ్ల కురువృద్ధుడిని చేర్చుకొని రాజకీయ పునరేకీకరణ అంటున్నారని, రాజకీయ పున రేకీకరణ పేరుతో తెలంగాణ వ్యతిరేక శక్తులను తీసుకువచ్చి తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం చేస్తామని చెబుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు.
తెలంగాణ కోసం ఉద్యమ నాయకత్వం రెండుసార్లు పదవులకు రాజీనామా చేసినప్పుడు తనకు వైఎస్ నాయకత్వం ఉంటే చాలని జీవన్‌రెడ్డి అన్నారని కవిత పేర్కొన్నారు. జగిత్యాల బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ నాయకత్వం పల్లెత్తు మాట కూడా అనకపోవడంలో వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. లోక్‌సభలో మహిళా బిల్లు వీగిపోవడం, డీలిమిటేషన్ బిల్లు, జనగణనపై ఒక్కమాట మాట్లాడలేదన్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో ఆడబిడ్డలకు ఎప్పుడూ గౌరవం ఉండదని, అందుకే మహిళా కోటా బిల్లు వీగిపోయినా ఒక్క మాట మాట్లాడలేదన్నారు.
బీఆర్‌ఎస్ ఉత్తి కథలు.. కాంగ్రెస్ పిట్ట కథలు..
రాష్ట్రంలో అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఒకేరోజు భారీ బహిరంగ సభలు పెట్టి ‘తూ కిత్నా అంటే.. అంటే మై కిత్నా’ అంటూ బలప్రదర్శనకు దిగుతున్నాయి తప్పితే ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని కవిత విమర్శించారు. ‘బీఆర్ ఎస్ ఉత్తి కథలు చెప్తే.. కాంగ్రెస్ పార్టీ పిట్ట కథలు’ చెప్పిందన్నారు. పార్టీల సెంట్రిక్‌గా కాకుండా ప్రజల సెంట్రిక్‌గా రాజకీయ నాయకత్వం ఉండాలని, అందుకే తాము కొత్త రాజకీయ శక్తిగా ఈ నెల 25న వస్తున్నామని కవిత తెలిపారు.
ప్రజల కష్టాలు తీర్చేందుకు ఒక ఆడబిడ్డగా తాను ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. ప్రజలంతా తరలివచ్చి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. గుంట నక్క ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలను కలవడానికి ఢిల్లీ వెళ్లారని గుంపుమేస్త్రీ అంటున్నారని, ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలను కలవడానికి బీఆర్‌ఎస్ నాయకు డు వెళ్తే ముఖ్యమంత్రిగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీపై లేదా అని ప్రశ్నించారు.
కాళేశ్వరం కేసులో ఏదో జరగబోతుందని కోర్టు తీర్పులను ప్రభావితం చేసేలా సీఎం మాట్లాడుతున్నారని అన్నా రు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధ సంస్థలను తక్కువ చేసేలా సీఎం మాట్లాడారని అన్నారు. కోర్టులపై తనకు గౌరవం ఉందని, కానీ ఫలానా కేసులో ఇలాంటి తీర్పు రాబోతుందని ముఖ్యమంత్రి చెప్పడం ఏమిటని నిలదీశారు.
ఎవరు ప్రతిపక్షంలో ఉండాలో, ఎవరు పాలకపక్షంలో ఉండాలో డిసైడ్ చేయాల్సింది ప్రజలన్నారు. సీజన్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా సగం మందికి రైతుభరోసా ఇవ్వలేదని, హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చేస్తున్నారని, కుమ్మెర జాతరలో రెండు నెలల పాప చనిపోయినా మాట్లాడలేదన్నారు. ఆర్టీసీ కార్మికులంటే లెక్కలేనితనంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.






