మొక్కల సంరక్షణతోనే పర్యావరణ పరిరక్షణ
26-08-2026 02:09 AM
మొయినాబాద్ ఆగస్టు 25(విజయ క్రాంతి): పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మొయినాబాద్ మున్సిపాలిటీ 19వ వార్డు కౌన్సిలర్ కళ్లెంల జగపతి అన్నారు. వనమహోత్సవంలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం అప్పోజీగూడలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో గ్రామ పెద్దలతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా జగపతి మాట్లాడుతూ.. పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజు, మాజీ వార్డు సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నర్సింహ, ఉపాధ్యాయురాలు అమృత, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






