30 August, 2026 | 2:06 AM

ఆదివాసీల గుండెల్లో కలెక్టర్లు!

30-08-2026 01:04 AM

అధికారులుగా వచ్చారు.. ఆత్మీయులుగా నిలిచారు. ఆదివాసీ గిరిజనుల దశాబ్దాల సమస్యలకు పరిష్కారం చూపి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఇంటి స్థలాలు, విద్యుత్, తాగునీరు, పక్కా ఇళ్ల వంటి మౌలిక వసతులు కల్పించినందుకు కృతజ్ఞతగా గిరిజనులు తమ గూడేలకు జిల్లా కలెక్టర్లు దివ్యదేవరాజన్, రాజర్షి షా పేర్లు పెట్టుకున్నారు.

ఒకటి దివ్యగూడెం కాగా, మరొకటి రాజర్షిషా గూడెం. ఆదిలాబాద్ అడవుల్లో నివసించే ఆదివాసీ గిరిజనులు కలెక్టర్లకు ఇచ్చిన ఈ అరుదైన గౌరవం.. ప్రజలకు, పాలనకు మధ్య ఆత్మీయ బంధానికి ప్రతీకగా నిలుస్తోంది. అడవినే నమ్ముకుని జీవనం సాగించే ఆదివాసీల మనసులు కూడా అడవిలాగే స్వచ్ఛమైనవని, తమకు అండగా నిలిచినవారిని గుండెల్లో పెట్టుకుంటారనడానికి నిదర్శనం ఈ ఉదంతాలు.     

దివ్యగూడెంగా చించుఘాట్

ప్రస్తుత పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్.. 2017- ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించిన సమయంలో గిరిజనుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చించు ఘాట్ పంచాయతీ పరిధిలోని గూడెం గిరిజనులు తమ ప్రధాన సమస్యలైన ఇంటి స్థలాలు, విద్యుత్, తాగునీటి కష్టాలను కలెక్టర్ దివ్య దేవరాజన్ దృష్టికి తీసుకువెళ్లారు.

వెంటనే స్పందించిన దివ్య దేవరాజన్ స్వల్ప కాలంలోనే వారి సమస్యలను పరిష్కరించారు. కలెక్టర్ చేసిన సహకారానికి కృతజ్ఞతగా చించు ఘాట్  ప్రజలు తమ ఊరి పేరు ను దివ్యగూడెంగా నామకరణం చేసుకున్నారు. స్వయంగా దివ్య దేవరాజన్ పిలిపించి ఆదివాసీ సంప్రదాయాలతో సత్కారం చేసి దివ్యగూడెం పేరున ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 

రాజర్శి షా గూడెం..

ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పలదరి గ్రామ పంచాయతీ పరిధిలోని దైగూడలో 55 కొలం గిరిజన కుటుంబా లు జీవనం సాగిస్తున్నాయి. ఈ గూడెంలో 17 కుటుంబాల కు ఇండ్లు నిర్మించుకునేందుకు స్థలాలు లేవు. ప్రస్తుత జిల్లా కలెక్టర్ రాజర్షి షా వారి సమస్యను గుర్తించి ఇంటి స్థలాలు కేటాయించడంతో పాటు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారు. త్వరితగతిన ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అలాగే మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చొరవ చూపారు. 

అందుకు కృతజ్ఞతగా కొలం గిరిజనులు దైగూడకు రాజర్శి షా గూడెంగా నామకరణం చేశారు. ఈ నెల 13వ తేదీన గిరిజనులు గృహ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా  కలెక్టర్‌ను పిలిపించి ఆయన చేతుల మీదుగా తమ గూడెం పేరును రాజర్శి షా గూడం పేరుగా శిలాఫలకం ఆవిష్కరింప చేయించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు కలెక్టర్ల సేవలకు చిరస్థాయిగా ఈ రెండు గూడేల పేర్లు నిలిచిపోయాయి.

 ఉట్నూర్, విజయక్రాంతి