24 August, 2026 | 2:56 AM

ఆలయ భూమి కబ్జాకు యత్నం!

24-08-2026 02:08 AM

కోట్ల విలువచేసే జాగాలో పాగా వేసిన అక్రమార్కులు..

నాగర్ కర్నూల్ ఆగస్టు 23 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నాగనూరు రెవెన్యూ గ్రామ శివారులోని సర్వేనెంబర్ 362లోని సుమారు మూడు ఎకరాల హనుమాన్ ఆలయ ప్రాంగణంలో కొంతమంది అక్రమార్కులు సిమెంటు ఇటుకల తయారీ కేంద్రాన్ని మరి కొంతమంది లారీ షెడ్యూలను ఏర్పాటు చేసుకొని ఆలయ భూమి కబ్జాకు ప్రయత్నిస్తున్నట్లు విమర్శలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఆలయ భూమిలో తాత్కాలిక షెడ్ పేరుతో ఏళ్లతరబడి దాబా ఏర్పాటు చేసుకోగా అది ఖాళీ చేయించేందుకు ఎండోమెంట్ అధికారులు పలుమార్లు ప్రయత్నం చేశారు.

ప్రస్తుతం ఆ అంశం కోర్టు పరిధిలో ఉండగానే అదే ఆలయ భూముల్లో మరి కొంతమంది వ్యక్తులు ఆ భూమిని కబ్జ చేసేందుకు యత్నిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ అండదండలు, ధన బలం ఉన్న పెద్దలు కోట్ల విలువ చేసే జాగాను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అందుకు రాజకీయ పెద్దలు సైతం తెర వెనక సహకరిస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎండోమెంట్ అధికారులు సైతం తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో అక్రమార్కులు ఇదే అదునుగా భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ఆలయ ఈవో శేఖర్ గౌడ్ ను వివరణ కోరెందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.