జహీరాబాద్‌లో 2 లక్షల మందికి ఉపాధి
- 2028 మార్చి వరకు పారిశ్రామిక స్మార్ట్ సిటీ పూర్తి
- ఐటీ శాఖ మంత్రి దిద్దిళ్ల శ్రీధర్‌బాబు
- కేంద్ర మంత్రులతో వీడియో కాన్ఫరెన్సులో వెల్లడి
రంగారెడ్డి, ఆగస్టు 17 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులన్నీ 2028 మార్చి వరకు పూర్తి చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఇక్కడ దాదాపు 2 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. 3,245 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ పారిశ్రామిక వాడకు రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన చెప్పారు.
సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయెల్‌లు న్యూఢిల్లీ నుంచి నిర్వహించిన నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ వీడియో కాన్ఫరెన్సులో శ్రీధర్‌బాబు సచివాలయం నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పరిశ్రమల మంత్రులు ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. జహీరాబాద్ స్మార్ట్ సిటీలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని శ్రీధర్ బాబు వివరించారు. ఈ స్మార్ట్ సిటీలో భూమి రూపం లో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51 శాతం ఉండగా, కేంద్ర ప్రభుత్వం అభివృధ్ది పనులకు నిధులు అందజేస్తోంది.
ఇప్పటికే స్పెషల్ పర్పస్ వెహికల్‌కు అభివృద్ధి ప్రణాళికను అందజేసినట్టు శ్రీధర్ బాబు తెలిపారు. ఇంజినీరింగ్, ప్రొక్యూర్ మెంట్, కన్‌స్ట్రక్షన్ (ఇపిసి) పద్ధతిలో జరగుతున్న పనులు ముందుగా నిర్ణయించిన సమయానికి పూర్తవుతాయిని శ్రీధర్‌బాబు వెల్లడించారు.
నీటి సరఫరా పనుల టెండర్ల ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. విద్యుత్తు సరఫరా పనులను కూడా గడువులోగా పూర్తి చేస్తామని వివరించారు. భవ్య పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 100 ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల్లో నాలుగింటిని తెలంగాణాకు కేటాయించాలని మంత్రి పీయూష్ గోయె ల్‌ను కోరారు. వీడియో కాన్ఫరెన్సులో టిజిఐఐసి ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య, పరిశ్రమల కమిషనర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.






