24 August, 2026 | 3:32 AM

పుష్కర కాలం తరువాత... ఉద్యోగుల ఆందోళన బాట..

24-08-2026 12:42 AM

కరీంనగర్ ఉమ్మడి జిల్లా కీలకం

కరీంనగర్, ఆగస్టు 23 (విజయక్రాంతి): తెలంగాణ కోసం సకలజన సమ్మె సైరన్ ను కరీంనగర్ లో మోగించిన ఉద్యోగులు పుష్క ర కాలం తరువాత స్వరాష్ట్రం లో ఆందోళనకు సిద్ధం అయ్యారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి.

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు 17వేలకు పైగా ఉండగా, 12000 మందికి పైగా పెన్షనర్లు ఉన్నారు. వీరే గాకుండా 20వేల మంది కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, 6000 మంది గేజిటడ్ ఉద్యోగులు, 13 వేల మందికి పైన ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. పీఆర్సీని వెంటనే అమలు చేయ డంతోపాటు పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, హెల్త్ కార్డుల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కోరుతున్నాయి. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను వెంటనే చేపట్టాలని, జీవోనం.25ను సవరించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. జీవో నం.190ను అమలు చేయడంతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులకు సంబంధించిన ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి. 

- 27 న ధర్నాలతో స్టార్ట్..

సమస్యల పరిష్కారానికి టీజీజేఏసీ ప్రకటించిన కార్యాచరణలో భాగంగా ఈ నెల 27న రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో ధర్నా లు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 1న పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. సెప్టెంబరు 10న ’చలో హైదరాబాద్‘ పేరుతో మహాధర్నా నిర్వహించనున్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు.

ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత: దారం శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్

- ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలు బాగుపడతాయని ఆశించాం. కానీ నేడు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకుండా అనేక ఇబ్బందులతో వారి బతుకులు బజారున పడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఉచితాలు అడగడం లేదు.

రాజ్యాంగబద్ధం గా, చట్టబద్ధంగా తమకు రావాల్సిన హక్కులను మాత్రమే కోరుతున్నారు. పెన్షన్ అనేది ఉద్యోగులకు ప్రభుత్వం చేసే దానం కా దు. దశాబ్దాల పాటు ప్రభుత్వానికి, ప్రజలకు సేవ చేసిన ఉద్యోగులకు వృద్ధాప్యంలో కల్పించాల్సిన సామాజిక, ఆర్థిక భద్రత. ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.