24 August, 2026 | 1:07 AM

సహకార పదవులపై ఆశావహుల ఫోకస్..!

24-08-2026 12:30 AM
  1. పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్ పదవుల కోసం పోటాపోటీ
  2. నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ నేతల కన్ను
  3. చైర్మన్ పదవి కోసం సీనియర్లు.
  4. స్థానిక రాజకీయ సమీకరణాలే కీలకం..
  5. పదవి ఎవరికి దక్కేనో?

పినపాక, ఆగస్టు 23 (విజయక్రాంతి): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) చైర్మన్, డైరెక్టర్ పదవులపై ఆశావహుల దృష్టి పెరిగింది. సొసైటీల పాలకవర్గాల గడువు ముగియడంతో ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం నామినే టెడ్ విధానంలో కొత్త చైర్మన్లు, డైరెక్టర్లను నియమించేందుకు కసరత్తు చేస్తుండటంతో అధికార పార్టీ నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. పినపాక నియోజకవర్గ పరిధిలోని రెండు సొసైటీలకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వానికి చేరినట్లు సమాచారం.

మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఆలస్యమవుతుండటంతో రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న పదవులను దక్కించుకునేందుకు పలువురు నేతలు ముఖ్య నాయకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. చైర్మన్ పదవుల కోసం సీనియర్ నేతలు పోటీ పడుతుండగా, గ్రామస్థాయి నా యకులు డైరెక్టర్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవుల భర్తీ కూడా పెండింగ్లో ఉండటంతో సహకార సంఘాల నామినేటెడ్ పదవులకు డిమాండ్ పెరిగింది. స్థానిక ఇన్చార్జీల నిర్ణయమే కీలకం కావడంతో భవిష్యత్ రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని పదవుల ఎంపికపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చలు సాగుతున్నట్లు సమాచారం. కీలక నాయకులు, పార్టీకి బలంగా పనిచేసే వారికి ప్రా ధాన్యత ఇచ్చే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.