28 May, 2026 | 4:40 AM

త్వరలో ఆర్టీసీ కార్మిక సంఘాలకు ఎన్నికలు

28-05-2026 01:41 AM
  1. ఆ తర్వాత విలీన ప్రక్రియను ప్రారంభిస్తాం
  2. 60 ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభంలో మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): / కూకట్‌పల్లి త్వరలోనే ఆర్టీసీ కార్మిక సంఘాలకు గుర్తింపు ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ తర్వాత ఎన్నికైన సంఘాలతో కలిసి ఆర్టీసీ విలీన ప్రక్రియను ప్రారంభిస్తామని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రతి రెండో మంగళవారం ప్రత్యేకంగా సమయం కేటాయించనున్నట్లు తెలిపారు. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా కూకట్‌పల్లి డిపోకు చెందిన 60 నూతన ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఒక్క హైదరాబాద్‌లోనే 540 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,050 ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయని వెల్లడించారు. టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి మాట్లాడుతూ ఈవీ బస్సుల విస్తరణలో భాగంగా ప్రధాన డిపోలు, బస్టాండ్లలో అత్యాధునిక ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం మంత్రి ప్రభాకర్ ఎండీ నాగిరెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, అధికారులతో కలిసి నూతన బస్సుల్లో ప్రయాణించారు.

ఇదిలా ఉంటే సచివాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ బ్రౌచర్‌ను ఆ వర్సిటీ వీసీ, అధికారులతో కలిసి మంత్రి పొన్నం విడుదల చేశారు. ఇటీవల రైతులపై వ్యాఖ్యలు చేసిన డ్రైవర్ ఆర్టీసీ ఉద్యోగి కాదని, ఆయన హైర్ బస్ డ్రైవరని మంత్రి తెలిపారు. ఈ విషయంలో డిపో మేనేజర్‌ను బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. ఎంపీగా చేసిన బాల్క సుమన్ జాతీయ సంపద రైల్వే పట్టాలను కోసేయాలని రాజకీయ ఉన్మాదిగా మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎస్‌యూఈ కాలేజీపై అపోహలొద్దు

శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ప్రారంభమైన మొదటి సంవత్సరమే ఏం వసతలుంటాయనే అపోహ అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కాలేజీకి అడ్మిషన్లు రావాలని ప్రైవేట్ కాలేజీతో పోటీగా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. శాతాహవాన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ శాశ్వత భవనాలు ప్రారంభమయ్యాయని, ఎంసెట్ రాసిన విద్యార్థులు శాతహన యూనివర్సిటీ కాలేజీ ఆప్షన్ తీసుకోవాలని విద్యార్థులను కోరారు.

బుధవారం సచివాలయంలో హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ బ్రౌచర్ మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. కాలేజీకి సంబంధించిన విషయాలను వెల్లడిం చారు. ఎస్‌యూఈలో విద్యార్థులకు సైకిళ్లు, పుస్తకాలు, కాలిక్యులేటర్ పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం 2026 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కొనసాగుతున్నాయని, విద్యార్థులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం వివరించారు.