ఎన్నికల హామీలు అమలు చేయాలి
కలెక్టరేట్‌ను ముట్టడించిన సీపీఐ శ్రేణులు
సూర్యాపేట, జులై 1 (విజయక్రాంతి): ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో సూర్యాపేట కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ప్రభుత్వాలు మారినా ప్రజల బతుకులు మారడం లేదని, కేవలం అధికారం కోసమే నాయకులు అబద్ధపు వాగ్దానాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన 21 హామీలలో ఏ ఒక్కటీ అమలు కాలేదని, ఆరు గ్యారెంటీలలో ఉచిత బస్సు మినహా మిగతా పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.రైతు భ రోసా పూర్తిస్థాయిలో అందడం లేదని, పెన్షన్ల పెంపుతో పాటు కొత్త పెన్షన్ల మంజూరు హామీలు నీటిపాలయ్యాయని ఆయన ఆరోపించారు.
సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విబిజి రాంజీ చట్టాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, అలాగే రైతులను ఇబ్బంది పెడుతున్న యూరియా యాప్ను తక్షణమే ఎత్తివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు, ఉస్తేల సృజన, మేకల శ్రీనివాస్ తదితర ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.






