పకడ్బందీగా పంద్రాగస్టు ఏర్పాట్లు
- ప్రొటోకాల్‌ను తప్పక పాటించాలి
- అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలి
- రవాణా, ఆర్ అండ్ బీ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్
హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి) : పంద్రాగస్టు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని, పనులన్నీ వేగవంతంగా పూర్తి చేయాలని రవాణా, ఆర్ అండ్ వీ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం గోల్కొండ కోటలో నిర్వహించనున్న స్వాతం త్య్ర దినోత్సవ వేడుకలు జరిగే ప్రాంతాన్ని గురువారం సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఆయన పరిశీలించి, ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
వర్షాకాలం నేపథ్యంలో కార్యక్రమంలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా వాటర్ ప్రూఫ్ షామియానాలు, వాటర్ ప్రూఫ్ జనరేటర్, నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, బారికేడింగ్, గ్యాలరీలు, వచ్చే అతిథులు, విద్యార్థులు, ప్రజల సీటింగ్ సామర్థ్యం, సౌండ్ సిస్టమ్ తదితర ఏర్పాట్లను ఉన్నతస్థాయి అధికారులతో కలిసి ఆ యన సమీక్షించారు. కార్యక్రమ నిర్వహణలో ఎక్కడా ప్రొటోకాల్‌కు ఇబ్బంది కలగకుండా అధికారులు నిబద్ధతతో వ్యవహరించాలని ఆయన సూచించారు.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నందున ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రతి వాహనంలో వచ్చే పిల్లలకు ఒక లైజనింగ్ అధికారి తప్పనిసరిగా ఉండేలా చూ డాలని విద్యాశాఖ అధికా రులను ఆదేశించా రు.
పంద్రాగస్టు రోజున సీఎం, మంత్రులు, ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఘనంగా ఉండాలని, ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లను పక్కాగా, వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు.






