26 August, 2026 | 2:41 AM

బీసీల హక్కుల సాధనకు కృషి చేయాలి

26-08-2026 12:00 AM

ఆసిఫాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల పితామహుడు, సామాజిక న్యాయ సాధన కోసం జీవితాంతం కృషి చేసిన బి.పి. మండల్ ఆశయాలను కొనసాగిస్తూ బీసీల హక్కుల సాధనకు నిరంతరం పోరాడుతామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూపునార్ రమేష్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ అన్నారు. బి.పి. మండల్ జయంతి సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలోని సామాజికంగా, వి ద్యాపరంగా వెనుకబడిన తరగతుల అభివృద్ధికి మండల్ కమిషన్ చేసిన కృషి చారిత్రాత్మకమన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ రంగాల్లో తగిన ప్రాతినిధ్యం, సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని మండల్ కమిషన్ బలంగా ముందుకు తీసుకువచ్చిందన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన న్యాయమైన వాటా కల్పించాలంటే సమగ్ర కులగణన అవసరమని పేర్కొన్నారు.

బీసీల వాస్తవ జనాభా, సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులపై ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులోకి వస్తేనే సమర్థవంతమైన సంక్షేమ విధానాలు రూపొందించగలమన్నారు. బి.పి. మండల్ ఆశయాలు రిజర్వేషన్లకే పరిమితం కాకుండా సమానత్వం, గౌరవం, హక్కులు, ప్రాతినిధ్యం సాధించడమే లక్ష్యమని తెలిపారు.బీసీ యువత మండల్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సామాజిక న్యాయం కోసం ఐక్యంగా ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీసీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వైరాగడే మారుతి పటేల్, మామిడి కిరణ్, ఆసిఫాబాద్ డివిజన్ అధ్యక్షుడు బొట్టుపల్లి ప్రశాంత్, మండల అధ్యక్షుడు సిరికొండ సాయికృష్ణ, కాంగ్రెస్ మైనార్టీ మండల అధ్యక్షుడు షేక్ అసద్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చూనార్కర్ వసంతరావు, ఇగరపు సంతోష్, బీఆర్‌ఎస్ నాయకుడు మాటూరి జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.